– కుమ్మకైన నాయకులు, అధికారులు, మిల్లర్లు
– కాంగ్రెస్ పాలనలో పెరిగిన దళారి వ్యవస్థ
– నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్, ఏప్రిల్ 13 : నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు సంఘాల పేరిట సోసైటీలను ఏర్పాటు చేసి రైతులను దోపిడి చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. సోమవారం కట్టంగూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అన్నమో రామచంద్రగా తయారైందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం వ్యవసాయరంగం గణనీయమైన పురుగతి సాధించిందన్నారు. నల్లగొండ జిల్లా వ్యవసాయ అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానం, దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, సరైన ధాన్యం కొనుగోలు, సాగునీటి సదుపాయాల కల్పనతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకున్న ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తుగ్లక్ పాలన అభివర్ణిస్తూ రైతులు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. గత రెండున్న సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, కేంద్రాలపై సీఎం, మంత్రులకు పట్టింపు లేకుండా పోయిందని ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే వీరేశం సొంత మనుషులను పెట్టుకుని చత్తీస్గఢ్, విజయవాడ నుండి తీసుకొచ్చిన ధాన్యం రాత్రికి రాత్రే కాంటాలు వేయిస్తున్నారని ఆరోపించారు. కేంద్రాల నిర్వాహకులు క్వింటాకు 10 కేజీల తరుగుడు తీస్తూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. రైతులు కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు గడిచినా కాంటాలు వేయడం లేదని, ప్రభుత్వ, మిల్లర్లు మధ్య సయన్వయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. మిల్లర్లు, అధికారులు కుమ్మకై మిల్లులను మూసివేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో దళారి వ్యవస్థ పెరిగిపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. తమ ధాన్యం అమ్ముకునేందుకు రైతులు రూ.5 నుంచి 10 వేల వరకు నిర్వాహకులకు లంచాలు ఇచ్చి కాంటా వేయించుకునే పరిస్థితులు ఏర్పడిందన్నారు. ప్రశ్నించిన రైతుల ధాన్యం కొనుగోలు చేయకుండా వారిని వేదిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, పెద్ది బాల నర్సయ్యగౌడ్, పెద్ది మల్లేశ్ పాల్గొన్నారు.