న్యూఢిల్లీ, ఆగస్టు 14 : భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి వ్యతిరేకంగా నిరసన తెలిపిన నల్సార్ యూవివర్సిటీ విద్యార్థుల నమోదును నిలిపివేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా జారీచేసిన ఆదేశాలపై(వాటిని ఆయన తర్వాత ఉపసంహరించుకున్నారు) సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉన్నదని పేర్కొన్న సీజేఐ సూర్యకాంత్ ఈ విషయంలో బీసీఐ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. నిరసన తెలిపే హక్కు వారికి ఉంది. విద్యార్థులు నాకు లేఖ రాసి ఉండవచ్చు. ఇది విద్యార్థులకు, నాకు మధ్య జరుగుతున్న సంభాషణ. అనవసరంగా ఈ సమస్యను లేవనెత్తడానికి వారు(బీసీఐ) ఎవరు? ఇది పూర్తిగా అనవసరమైన చర్య.
దీనితో బీసీఐకి ఎటువంటి సంబంధం లేదు అని సీజేఐ అన్నారు. నేను కూడా విద్యార్థి దశలో ఉన్నపుడు విద్యార్థి కార్యకలాపాల్లో పాల్గొన్నాను. వారు శాంతియుతంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. వారికి ఆ అవకాశం ఉండాలి. ఒకవేళ వారు తప్పుగా భావించినా సరే, నిరసన తెలిపే హక్కు వారికి ఉంది. వారిని ఎవరు అడ్డుకోగలరు? చట్టబద్ధంగా, శాంతియుతంగా గళం వినిపిస్తున్నంత కాలం వారి మాటలను వినాలి. బార్ కౌన్సిల్ లేదా మరే ఇతర సంస్థ అయినా ఇందులో ఎందుకు జోక్యం చేసుకోవాలి అని సీజేఐ వ్యాఖ్యానించారు. యువ దశలో ఎవరైనా తప్పుగా అనిపించే వ్యాఖ్యలు చేసినా, వాటిని తప్పుగానే ఉండనివ్వండి. కానీ దానిపై చర్య ఎందుకు తీసుకోవాలి? అని ఆయన అన్నారు. బీసీఐ చైర్మన్ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్ గురించి సీనియర్ న్యాయవాది కే పరమేశ్వర్ మౌఖికంగా ప్రస్తావించినపుడు సీజేఐ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీసీఐ చైర్మన్ లేఖలలో ప్రస్తావించిన ఘటనల(స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రచారం) నేపథ్యంలో బీసీఐ లేదా ఏ ఇతర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు కూడా నల్సార్ విద్యార్థులు లేదా అధ్యాపకులపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వు జారీచేసింది. ఆదేశాన్ని వెలువరించిన అనంతరం సుప్రీంకోర్టు బార్లో చేరడానికి నల్సార్ విద్యార్థులను ఆహ్వానిస్తున్నట్టు సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. కాగా, సీజేఐకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ప్రచారంపై విచారణ జరపాలని, వారి నమోదును(ఎన్రోల్మెంట్) నిలిపివేయాలని కోరుతూ బీసీఐ చైర్మన్ రాసిన లేఖలను సవాలు చేస్తూ నల్సార్ పూర్వ విద్యార్థులైన మిహిరా సూద్, అభిషేక్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
నల్సార్ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ మొత్తం నమోదును నిరోధించడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసి ఉపసంహరించుకున్న ఆదేశాలు ఆ సంస్థ ప్రతిష్టను దిగజార్చాయి! అలాగే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తాయి. అసమ్మతి తెలిపే హక్కును వినియోగించుకున్న విద్యార్థులను శిక్షించడంలో ఒక చట్టబద్ధ సంస్థ ఎంతవరకు వెళ్లగలదు? ఆ వృత్తిలోకి ఇంకా ప్రవేశించని వారిని సైతం ఆ సంస్థ నియంత్రించగలదా? బీజేపీ ఎంపీ, బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ప్రతిష్ఠాత్మక నల్సార్కు చెందిన 2026లో పట్టభద్రులయ్యే బ్యాచ్ మొత్తానికి సంబంధించిన నమోదు ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను గురువారం ఆదేశించడం తీవ్రమైన చర్య అసమంజసంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలనే డిమాండ్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. నల్సార్ ఎన్రోల్మెంట్ వివాదంలో బార్ కౌన్సిల్ జోక్యాన్ని సీజేఐ విమర్శించిన కొన్ని గంటలకే సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ బీసీఐ చైర్మన్ మిశ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. మిశ్రా రాజీనామాకు డిమాండ్లు పెరిగాయి.