నల్లగొండ రూరల్, మే 28 : బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడారు. బిల్లును కేంద్రానికి పంపామని, అక్కడి నుండి జవాబు రాలేదని కేంద్రంపై నెపం నెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసినట్లేనని అన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి భర్తీచేసిన ఏ నామినేట్ పోస్టుల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. మంత్రివర్గంలో గాని నామినేటెడ్ పోస్టులో గానీ కార్పొరేషన్ లో గాని తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
కాబట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయాలని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నల్లగొండ బీసీ సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనియెడల బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి రాబోయే అన్ని ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేశ్ గౌడ్, జిల్లా కార్యదర్శి షర్టు యాదగిరి, వల్ల కీర్తి శ్రీనివాస్, యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీశ్, యాదవ ఉపాధ్యక్షుడు సుంకరబోయిన శివయాదవ్, బీసీ సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి అల్లి చంద్రయ్య, ఆడం తిరుపతి గౌడ్, కొవ్వూరి హరిబాబు, గంజి మల్లేశం పాల్గొన్నారు.