నల్లగొండ సిటీ, డిసెంబర్ 9 : గ్రామ పంచాయతీ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కనగల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని, బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. మండల కేంద్రంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించారు. పోలీంగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి కావాల్సిన సామగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. ఓటరు జాబితా వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు అన్నీ ఓపెన్ అవుతున్నాయో లేదో సరి చూసుకోవాలన్నారు.
డిస్టిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయాలన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతి కల్పించి చివరిగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు ముందుగా బస్సులను పంపించాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ పరఫరా ఉండేలా చూడాలన్నారు. ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలన్నారు. తాగునీరు, మూత్రశాలలు, పార్కింగ్ ప్రదేశాలు వచ్చిపోయే దారుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, ఆర్డీవో అశోక్‌రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, ఎంఈవో పద్మ తదితరులు ఉన్నారు.
నల్లగొండ రూరల్, డిసెంబర్ 9: గ్రామ పంచాయాతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మండల పరిధిలోని ఇంద్రరెడ్డి ఫంక్షణ్హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పర్యవేక్షించారు. కార్యక్రమంలో డీపీవో వెంకయ్య, జెడ్పీసీఈవో శ్రీనివాస్‌రావు, ఆర్డీవో అశోక్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీశేఖర్రెడ్డి, తసీల్దార్ పరశురాం, ఎంపీడీవో యాకుబ్ నాయక్ ఉన్నారు.