హైదరాబాద్, ఫిబ్రవరి22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా, ఉద్యమకారుల పూనికతో ఆవిర్భవించిన తెలంగాణ వికాస సమితి (తెవిస) నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఎన్నుకున్నారు. సమితి నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కవి, ఉద్యమకారుడు వనపట్ల సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా మల్లావఝల విజయానంద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్సీ, సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ ఇక నుంచి గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతూ దిశానిర్దేశం చేయనున్నారు. దేశపతి నేతృత్వంలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సమితి కార్యవర్గ ప్రత్యేక సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సంసృతిని కాపాడటంలో నూతన కార్యవర్గం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా వెల్లడించారు.
సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమితి చర్చించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సమితి కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. గాంధీ సరోవర్ పేరిట మధు పార్ రిడ్జ్ అపార్ట్మెంట్ల విధ్వంసానికి పూనుకోవడాన్ని తప్పుబట్టింది. సామాన్యుల ఆస్తులను ధ్వంసం చేస్తూ, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధమని కా ర్యవర్గం హెచ్చరించింది. తెలంగాణ సమాజం పక్షాన నిలబడి, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను నిరంతరం ప్రశ్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.