సిద్దిపేట, ఫిబ్రవరి 22: సిద్దిపేట జిల్లాలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మేడిపెల్లికి చెందిన శ్రీజకు తల్లిదండ్రులు లేకపోవడంతో తన మేనమామ చదివిస్తున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని సురభి మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఆదివారం ఉదయం శ్రీజ హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించడంతో తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు దవాఖానకు తరలించగా.. శ్రీజ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించి, శ్రీజ మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీజ మృతికి కాలేజీ యాజమాన్యానిదే బాధ్యత అని విద్యార్థిని బంధువులు ఆరోపించారు. గతంలో కూడా ఈ కాలేజీలో ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నారని, సురభి మెడికల్ కాలేజీలో తరుచూ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటంపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.