– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నల్లగొండ, జనవరి 19 : దేశ ఉత్పత్తిలో ప్రధాన భాగస్వామ్య రంగాలైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా సిఐటియు, రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల జాతీయ కమిటీల పిలుపు మేరకు సోమవారం నల్లగొండలో సిపిఎం ఆఫీసు నుండి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి సభను నిర్వహించారు. ఈ సభకు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూడవసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తన కార్పొరేట్, మతతత్వ విధానాలను వేగవంతం చేసిందన్నారు. ప్రజల హక్కులను కాల రాయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ కార్పోరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందన్నారు. అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ, విద్యుత్ సవరణ చట్టం, విత్తన బిల్లు, విబీజి రాంజీ చట్టం, బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం, అణురంగంలోకి ప్రైవేటు కంపెనీలను అనుమతించడం దారుణం అన్నారు. మళ్లీ గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు పోవడానికి ప్రధాని మోదీ విధానాలు ముందుకు వస్తున్నాయని దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ విబీ జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలన్నారు. నూతన చట్టం రాష్ట్రాలు 40 శాతం, కేంద్రం 60 శాతం నిధులు వెచ్చించాలని చేశారు. దీనివల్ల రాష్ట్రాలు నిధులు వెచ్చించలేని పరిస్థితులు వస్తాయని, దీనివల్ల ఉపాధి పని దినాలు తగ్గుతాయన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని వారు దుయ్యబట్టారు. ప్రశ్నించవద్దని నేటి విధాన పత్రంలో మోదీ తెలియజేస్తున్నారు. సంపాదన సృష్టించడం, అభివృద్ధి చేయడం కార్మికుల పనిగా ఉన్నది కానీ మోదీ యజమానుల దయాదాక్షిన్యాలతో అడుక్కోవాలి తప్పా సమ్మెలు, పోరాటాలు చేసే హక్కును తొలగిస్తున్నట్లు, దీని ఫలితంగా కార్మిక వర్గం యజమానులకు బానిసలుగా మారనున్నట్లు పేర్కొన్నారు.
సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు, బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బికార్ మల్లేశ్, మహిళా రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద హాశం, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు బండ శ్రీశైలం, ఎండీ సలీం, కంబాలపల్లి ఆనంద్, దండెంపల్లి సత్తయ్య, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయన్న, పాదూరి శశిధర్ రెడ్డి, నలపరాజు సైదులు, భీమగాని గణేష్, రవి నాయక్, అవుట రవీందర్, మన్నెం భిక్షం, పోలె సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Nalgonda : ‘కార్మిక, కర్షక, ప్రజా హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమిద్దాం’