– ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింతం వినయ్ బాబు మాదిగ
పెన్పహాడ్, జనవరి 21 : కర్ల రాజేశ్ మృతికి కారకులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింతం వినయ్ బాబు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెన్పహాడ్ మండల కేంద్రంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పెన్పహాడ్ మండల కేంద్రానికి రానున్నారని తెలిపారు. మందకృష్ణ మాదిగ పాల్గొనే ఈ కార్యక్రమంలో వందలాది మంది దళితులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
కర్ల రాజేశ్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, ఆయన మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 5వ తేదీన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, పెన్పహాడ్ మండల ఇన్చార్జి పెంటన్నోళ్ల నరసింహ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు కొండేటి గోపి, పెన్పహాడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒగ్గు రవి, జిల్లా నాయకులు సూరారపు తిరుమలేష్ మాదిగ, నాగరకుంట మహేందర్ మాదిగ పాల్గొన్నారు.