హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యం, అవినీతి వల్ల విశ్వనగరం హైదరాబాద్ పతనావస్థకు చేరుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేండ్ల్లలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దామని, కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే నగరాన్ని కుప్పకూల్చారని, అధఃపాతాళానికి తొకేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదన్న ఏకైక కక్షతో హైదరాబాద్ మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారు. పారిశుధ్యం నుంచి ప్రజా రవాణా వరకు అన్ని రంగాలు కుప్పకూలాయి’ అని ఆయన విమర్శించారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో శనివారం జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ఆయన సుదీర్ఘ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ, అసెంబ్లీ సమావేశాల్లో నగరానికి సంబంధించి లేవనెత్తాల్సిన అంశాలపై విస్తృతంగా కేటీఆర్ చర్చించారు. నగరంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పోరాటానికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఆర్థిక ఇంజన్‌ను రేవంత్‌రెడ్డి కావాలనే దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో మొదలుపెట్టి, టీడీఆర్ సామ్, పారిశ్రామిక భూముల కేటాయింపు వరకు అన్నింటిలోనూ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు, అనుచరులు వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉన్న నగరాన్ని పట్టించుకోకుండా, కేవలం తన భూములకు విలువ పెంచుకోవడం కోసమే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని, ఇది ముమ్మాటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని మండిపడ్డారు.

Ktr
రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసమే..
రెండేండ్లుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అధఃపాతాళానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుపోయారని కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసమే రేవంత్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే హైదరాబాద్‌లో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే పూర్తిస్థాయిలో నగరాన్ని పతనానికి పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు, అనుచరుల కోసం వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రాజధాని నుంచి దోచుకోవడానికి హైడ్రా నుంచి మొదలుకొని పారిశ్రామిక భూముల సామ్, టీడీఆర్ పేరిట మరొక సామ్, ఫోర్త్ సిటీ భూముల కుంభకోణం.. ఇలా రేవంత్‌రెడ్డి 24 నెలలుగా చేసింది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని మండిపడ్డారు. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో ఎప్పుడూ లేని కరెంట్ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు అన్ని తిరిగి రాష్ట్ర రాజధానిలో దర్శనమిస్తున్నాయని, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యంతో, అక్రమ సంపాదన లక్ష్యంగా తన భూములకు విలువ తీసుకురావడం కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు.
సమరానికి సై.. ఎన్నికల బాధ్యతల అప్పగింత
రాష్ట్రంలో రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను కేటీఆర్ సమాయత్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నగర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. హైదరాబాద్ ఆత్మగౌరవాన్ని కాపాడతామని, ప్రభుత్వ పక్షపాత వైఖరిని ప్రజల ముందు ఎండగడతామని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. సమన్వయం కోసం ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీ సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ను నియమించారు. మలాజిగిరి కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సైబరాబాద్ కార్పొరేషన్ కోసం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు.
నాడు అగ్రశ్రేణి మెట్రో నగరం
పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి మెట్రో నగరంగా తీర్చిదిద్దామని కేటీఆర్ గుర్తుచేశారు. అన్ని రంగాల్లో నగరాన్ని ముందుకు తీసుకుపోయామని చెప్పారు. అందుకే ప్రజలు రెండు సార్లు రాష్ట్ర రాజధానిలో మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నగరంలో సొంతంగా మేయర్ పీఠంపైన గులాబీ జెండాను ఎగురవేశామని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం తన అరాచకాలు, అవినీతితో తెలంగాణ ఆర్థిక ఇంజన్‌ను కూలగొట్టి, నగరంలో రియల్ ఎస్టేట్‌ను, నగర ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలు అన్నింటినీ కుప్పకూల్చిందని ధ్వజమెత్తారు.