– దామరచర్లలో సీఐటీయూ నిరసన
దామరచర్ల, ఏప్రిల్ 01 : కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని సీఐటీయూ దామరచర్ల మండల కన్వీనర్ బి.దయానంద్ అన్నారు. లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దామరచర్ల మండల కేంద్రంలో కార్మికులు బుధవారం నల్ల బ్రాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ.. కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను ఈరోజు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు చట్టాలుగా విభజించడం చాలా దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా ఈ కోడ్ ల వల్ల కార్మికులు సంఘాలను పెట్టుకునే అవకాశం కోల్పోతారన్నారు. అదే విధంగా పని గంటలు పెరుగడం, వలస కార్మికులను తీసివేయడం వంటివి జరుగుతాయన్నారు.
కార్మికులే దేశానికి వెన్నుముక, కార్మికులు లేనిదే దేశం అభివృద్ధి సాధ్యం కాదని అలాంటి కార్మికులకు ఈరోజు సంఘాలు పెట్టుకునే అవకాశం లేకుండా అంతా కార్పొరేట్ వ్యక్తుల మాటలు నమ్మి వాళ్లు చెప్పినట్టుగానే చేస్తున్నారని ఇది చాలా దురదృష్టకరమన్నారు. కార్మికుల పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలకు వేతనాలు చాలడం లేదన్నారు. కార్మికులకు తీవ్ర నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లు తక్షణమే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు వాడపల్లి శ్రీరాములు, ఎండీ.జహీర్, అంకెపాక సైదులు, సహాయ కార్యదర్శి ఎం.సైదులు, సుందరమ్మ పాల్గొన్నారు.