న్యూఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. చట్టపరమైన నిబంధనలకు లోబడి, విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవడానికి లేదా మూసివేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జూలై 20న జరిగిన విద్యార్థి నిరసనలకు సంబంధించిన పిటిషన్లను విచారించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల అర్థంపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ స్పష్టత దోహదపడుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. గత ఉత్తర్వుల్లో పేర్కొన్న నేరచరిత్ర పరిధిని సుప్రీంకోర్టు కుదించింది. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం వంటి తీవ్రమైన, హేయమైన నేరాలకు పాల్పడిన వారికే ఈ పదం వర్తిస్తుందని స్పష్టం చేసింది.