సూర్యాపేట, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి కృష్ణా నదీజలాల్లో న్యాయం జరిగేంత వరకు ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరో యుద్ధం ఆరంభించబోతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో అత్యధిక స్థానాల్లో సత్తా చాటిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం నల్లగొండకు వచ్చిన కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలపై ధ్వజమెత్తారు. ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ జిల్లా మళ్లీ సమస్యల వలయంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా కొనసాగించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి డీపీఆర్‌ను కేంద్రం తిప్పి పంపితే ఏడు నెలలైనా పట్టించుకోని సోయి లేని ప్రభుత్వం ఇదేనన్నారు.
అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. అసమర్థ సీఎం, మంత్రుల కారణంగా ప్రాజెక్టు పరిధిని కుదిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి కేవలం దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి బాధ్యత కనిపించడం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రాజెక్టులపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆపసోపాలు పడుతున్నారని విమర్శించారు. నదీ జలాలపై ముఖ్యమంత్రికి ఏమాత్రం అవగాహన లేదని, ఇక మంత్రుల పరిస్థితి మరీ దారుణగా ఉందన్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలో నీళ్ల మంత్రి ఉన్నా ఆయనకు నీళ్లపై కనీస అవగాహన లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే ప్రిపేరై రాలేదంటున్నారని, మరో మంత్రి అయితే వాటర్‌లో నీళ్లు కలిపారంటూ మాట్లాడే అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయ జరిగినా కేసీఆర్ సహించబోరని కేటీఆర్ అన్నారు. జిల్లాలో దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యకు మిషన్ భగీరథ రూపంలో విముక్తి కల్పించి ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. జిల్లా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందన్నారు. ఎన్ని నిర్బంధాలున్నా ఎన్నికల్లో జనం బీఆర్ఎస్ మద్దతు దార్లకే పట్టం కట్టారన్నారు. ఇక నుంచి ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్కన ఉండబోతోందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎదురోలేక కాంగ్రెస్ అనేక అక్రమాలకు మోసాలకు పాల్పడింది. 25 సంవత్సరాలుగా మా స్వగ్రామంలో కాంగ్రెస్ ఉనికే లేదు. అక్కడ అనేక అక్రమాలకు పాల్పడి పోలీసు బలగాలను మొహరించి అక్రమంగా గెలిచారు.
బీఆర్ఎస్ నాయకులతో పెట్టుకుంటే మాడి మసైపోతారని మరోసారి నిరూపితమైంది. ఏదో అనుకొని వస్తే ఏదో జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవాలుగా మార్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నామినేషన్ల సమయంలో కూడా భయభ్రాంతులకు గురి చేశారు ధైర్యంగా నిలబడిన కార్యకర్తలకు ధన్యవాదాలు.
ఎన్నో కుట్రలు, నిర్బంధాలు పెట్టినా కూడా తట్టుకొని నిలబడి బ్రహ్మాండమైన మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం గొప్ప విషయం. అధికార పార్టీ మోసాలను తిప్పి కొట్టి బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో వ్యవహరించిన మాదిరిగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.
సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు అధికార పార్టీ వైపే ముగ్గు చూపుతారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఎన్ని ఇబ్బందులు పెట్టినా 40 శాతం ఫలితాలు వచ్చాయి. ఇవే ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగి ఉంటే 60 శాతం ఓట్లు బీఆర్ఎస్కు వచ్చేవి.
సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన ప్రతిఒక్కరికీ అభినందనలు. భవిష్యత్తులో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ఇదే రీతిన పట్టం కట్టాలి. కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే సీఎం, మంత్రులు తట్టుకోలేకపోతున్నారు. మంత్రి ఉత్తమ్ కృష్ణా నది నీటి వాటాలో జరిగిన అన్యాయం చెప్పకుండా జారుకుంటున్నారు. తెలంగాణ వాటాను 40 టీఎంసీలకు తగ్గిస్తే సీఎం, మంత్రులు నోరు మెదపడం లేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధం కావాలి.
అధికార పార్టీ నాయకులు ఎన్ని అరాచకాలకు పాల్పడినా చెకుచెదరకుండా జిల్లాలోని ఎమ్మెల్యేలకు, మంత్రులకు బీఆర్ఎస్ కార్యకర్తలు చెమటలు పట్టించి మెజార్టీ స్థా నాలు గెలిపించుకున్నారు. రేండేళ్లలో కాం గ్రెస్ చేసిన మోసాలను గ్రహించిన జనం ఓటుతో తగిన గుణపాఠం చెప్పారు. చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చినా కూడా ప్రభుత్వ అధికారులు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. జిల్లాలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తప్ప తట్టెడు మట్టి కూడా తీయలేదు.
నల్లగొండ జిల్లాకు సాగునీటిని అందించే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకంలో డీపీఆర్‌ను తిప్పి పంపితే అధికార పార్టీ నాయకులు నోరు మెదపడం లేదు.
నీలగిరి, డిసెంబర్ 23: సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు పన్నారు.. దౌర్జన్యాలు చేశారు.. మోసం చేసి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకున్నారు.. అయినా వాటన్నింటినీ తట్టుకుని నిలబడి విజయం సాధించారు.. మీ అక్రమాలపై ఇక ఊరుకునేది లేదు. నిన్నటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క అన్నింటికీ బదులు చెబుతాం అంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధిక సీట్లు వస్తే ప్రజల్లో సానుకూలత ఉందని, వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటన చేశారన్నారు. లోతుగా విశ్లేషణ చేసిన తరువాత పోలీసులు, అధికార యంత్రాంగం, కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్లే ఈ మాత్రం ఫలితాలైనా వచ్చాయి..
ఈపరిస్థితుల్లో ఎన్నికలకు పోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని వెనక్కి తగ్గారని అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని కేవలం కేసులు, విచారణల పేరుతో డ్రామాలాడారే తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. విద్యుత్తు కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని నివేదికలు వస్తే ఏం చేయాలో దిక్కు తోచని స్దితిలో ఈ-ఫార్ములా కేసు, ఫోన్ టాపింగ్ కేసులను మళ్లీ ముందుకు తెచ్చి జనం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ కార్యకర్తలు ఫుట్‌బాల్ అడుకున్నారని అన్నారు. కేసులు విచారణల పేరుతో డ్రామాలాడుతూ జనం దృష్టి మళ్లిస్తూ కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేస్తామని లీకులు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు కార్యకర్తలే బెదరడంలేదని, కేసీఆర్‌ను ఎలా ఎదురొంటారని ప్రశ్నించారు.