– రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పట్టణం అస్తవ్యస్తం
– కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పే సమయమిదే
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, జనవరి 28 : బీఆర్ఎస్ హయాంలో కోదాడ పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మంజూరు చేసిన కోట్ల రూపాయల నిధులతో పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కోదాడలో తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆయన విమర్శించారు. బుధవారం కోదాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వీధుల్లో చెత్త పేరుకుపోయి అస్తవ్యస్తంగా ఉందని, పారిశుధ్య లోపంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. నాడు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం, రోడ్ల విస్తరణ, హరితహారంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులతో కళకళలాడుతుండేదని, నేడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పట్టణం వెలవెల పోతుందన్నారు.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలన్నారు. పార్టీ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపిస్తేనే కోదాడ అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ పాలనలో దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. పోలీసుల అతి జోక్యంతో శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. మున్సిపల్ ఎన్నికలు పదవుల కోసం కాదని, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకులు సత్యబాబు, మామిడి రామారావు, తుమ్మలపల్లి భాస్కర్, గట్ల కోటేశ్వరరావు, కందుల చంద్రశేఖర్, అలవాల వెంకట్, సుందర్ బాబు, మేదర లలిత, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.