– వందల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన
– రెండు సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టి పోయని కాంగ్రెస్ ప్రభుత్వం
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, ఫిబ్రవరి 04 : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కోదాడ మున్సిపాలిటీ వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అప్రతిహతంగా కొనసాగాయని, పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన వందల కోట్ల రూపాయలతో కోదాడ పట్టణంలో మౌలిక వసతులు కల్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, పార్కులు తదితర అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం అయినప్పటికీ తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. శంకుస్థాపనలే కానీ ప్రారంభోత్సవాలు లేవని ఎద్దేవా చేశారు. ఈ 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డు అభ్యర్థి పిడతల శ్రీనివాసును భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు. 23 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గట్ల కోటేశ్వరరావు ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పైడిమరి సత్యబాబు, అభి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

‘బీఆర్ఎస్ పాలనలోనే కోదాడ సర్వతోముఖాభివృద్ధి’