సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 25 : ఆ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసి 20 రోజులకు పైగా నిరీక్షించారు. తర్వాత కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావడంతో ట్రాక్టర్ల ద్వారా మిల్లుకు తరలించారు. అక్కడా మరో రెండు రోజులు పడిగాపులు కాశారు. అయినా ధాన్యం దిగుమతి కాకపోవడంతో విసుగుపుట్టి ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేలు కిరాయి చెల్లించి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు తరలించి అమ్ముకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కనకం ఉపేందర్, శీలం రామ్మూర్తి, తోట రవి గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో 20 రోజుల కిందట ధాన్యం పోశారు. ఈ నెల 23న కాంటాలు పూర్తి కాగా క్వింటాకు రూ.2,300 ధర పలికింది. కాంటా అయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాల్సి ఉండగా మిల్లు యజమాని లారీలు పంపించకపోవడంతో కొనుగోలు కేంద్రంలోనే బస్తాలు నిలిచిపోయాయి. దీంతో రైతులే సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలను నేలకొండపల్లిలోని పద్మావతి మిల్లుకు తీసుకెళ్లారు. అక్కడ మిల్లు యజమాని లారీల్లో వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసిన తర్వాతనే ట్రాక్టర్లలోని ధాన్యాన్ని దిగుమతి చేస్తామనడంతో రెండు రోజుల పాటు మిల్లు వద్దే నిరీక్షించారు. రెండు రోజులైనా దిగుమతి చేసుకోకపోవడంతో ట్రాక్టర్ కిరాయి పెరిగిపోతుందని భావించి చేసేదేమీ లేక శుక్రవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు ధాన్యాన్ని తీసుకొచ్చారు. ఆ ధాన్యానికి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో క్వింటాకు రూ.1,980 ధర పలికింది. ఆరుగాలం కష్టిపడి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకున్నామని, కనీసం పెట్టుబడులు, కిరాయిలకు సరిపోను అయినా డబ్బులు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నేను 6 ఎకరాలు కౌలుకు తీసుకొని నాలుగెకరాల్లో వరి పండించాను. 160 బస్తాల దిగుబడి రాగా మా గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో పోశాను. 20 రోజుల క్రితం పోయగా ఈ నెల 23న కాంటాలు పూర్తయ్యాయి. ధాన్యానికి అలాట్ చేసిన నేలకొండపల్లిలోని పద్మావతి మిల్లు నుంచి లారీలు రాక పోవడంతో మేమే ట్రాక్టర్లో మిల్లుకు తరలించాం. అక్కడ దిగుమతికి ఆలస్యం చేస్తుండడంతో చేసేదేమీ లేక సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చాం. ఇక్కడ క్వింటా ధర రూ.1,980 పడడంతో పెట్టుబడి ఖర్చులకు కూడా రాలేదు
నాకున్న రెండెకరాల పొలంలో వరి సాగు చేశాను. దిగుబడిగా వచ్చిన 50 క్వింటాళ్ల ధాన్యాన్ని గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో పోశాను. సుమారు 20 రోజుల తర్వాత కాంటాలు అయినప్పటికీ మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకోలేదు. దీంతో చేసేదేమీ చివరికి ఖమ్మం మార్కెట్ కంటే పెద్దదైన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చాను. ఇక్కడ క్వింటాకు రూ.1,980 ధర పడింది. ఈ ధర పెట్టిన పెట్టుబడులు, ట్రాక్టర్ కిరాయిలకు కూడా సరిపోదు.