కోదాడ, ఏప్రిల్ 26 : రేపు వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా ప్రజా కంఠక కాంగ్రెస్ పాలనపై ఉద్యమ నేత కేసీఆర్ ఏం దిశా నిర్దేశం ఇస్తారో తెలుసుకునేందుకు ప్రజలంతా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. శనివారం కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించి, దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా నిలిపారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
నాడు అధికార పార్టీగా రాష్ర్టాన్ని పదేండ్ల పాటు సుభిక్షంగా పాలించి, నేడు ప్రతిపక్ష పార్టీగా 16 నెలలుగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే శ్వాసగా కేసీఆర్ నాయకత్వాన రజతోత్సవం జరుపుకుంటున్న వేళ చరిత్రాత్మకమైన భారీ బహిరంగసభకు ప్రజలు తరలిరావాలని కోరారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను మరిచి మంత్రులతో సహా నేతలందరూ రాష్ట్రాన్ని ఎక్కడికక్కడే దోచుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రజా కంటక పాలనపై ఉద్యమనేత కేసీఆర్ సభలో ఏం దిశా నిర్దేశం ఇస్తారో తెలుసుకునేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు విరక్తితో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల్లో బొంకిన కల్లబొల్లి హామీలను నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించినట్లు ప్రజలు అర్థం చేసుకున్నారని, ఇక ఇప్పుడు బీఆర్ఎస్ను ఎప్పుడూ అధికారంలోకి తీసుకురావాలా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇంత తక్కువ కాలంలో చీత్కరించబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నియోజకవర్గ నుంచి మూడు వేల మంది పార్టీ శ్రేణులు ఓరుగల్లు సభకు తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. అంతకుక్రితం మాజీ కౌన్సిలర్ మేదర లలిత, పలువురు మహిళలు సభకు హాజరు కావాలని పట్టణంలోని మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు పైడిమర్రి సత్యబాబు, ఏలూరి వెంకటేశ్వరరావు, అరె లింగారెడ్డి, పట్టణాధ్యక్షుడు నయీమ్, అల్వాల వెంకట్, చింతల నాగేశ్వరరావు, యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్, కర్ల సుందర్ బాబు, సుంకర అభినాయుడు, సంగిశెట్టి గోపాల్, ఉపేందర్ గౌడ్, తాజ్, ఉపేందర్ యాదవ్, తుపాకుల భాస్కర్, బొజ్జ గోపి, కాసాని మల్లయ్య గౌడ్ పాల్గొన్నారు.
Kodada : ప్రజా కంఠక పాలనపై కేసీఆర్ దిశా నిర్ధేశం : మాజీ ఎంపీ బడుగుల