పెన్‌పహాడ్, డిసెంబర్ 12 : రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పెన్‌పహాడ్ మండలం భక్తలాపురం, చీదేళ్ల గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు జట్టుకొండ యమున గణేష్, జూలకంటి ప్రమీల వెంకట్ రెడ్డికి మద్ధతుగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. రేవంత్ పాలనలో అన్నీ అమ్మకాలు, అరాచకాలే అన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. రాబోయే రెండేళ్లు చేస్తారనే నమ్మకం ఎవ్వరికీ లేదు అని, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు, కేసీఆర్ ఇచ్చిన పథకాలే సక్కగ ఇవ్వలేక సగం ఎగగొట్టారని దుయ్యబట్టారు.
ఐదు విడతల రైతు బంధులో ఎంతో మందికి రెండు విడతలే పడ్డట్లు వెల్లడించారు. వడ్లకు బోనస్, తులం బంగారం, మహిళలకు రూ.2,500, పెన్షన్ల పెంపు ఇలా అన్నీ మోసాలే అని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇండ్లను నమ్ముకుంటే ఉన్న ఇల్లు పీకి పందిరేసినట్లే అన్నారు. కేసీఆర్ నిర్మాణాలు చేపట్టి అందరిలో ఆనందం నింపితే. రేవంత్ కూల్చివేతలతో అందర్నీ కన్నీళ్లు పెట్టించిండన్నారు. కాంగ్రెస్ అంటే కమీషన్లు.. కొట్లాటలే అన్నారు. గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యం అన్నారు. కాంగ్రెస్ చిల్లర మూకలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా నిలబడి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చెర్మన్ వెన్న సీతారాంరెడ్డి, నెమ్మాది కృష్ణ, నెమ్మాది గంగారపు శ్రీను పాల్గొన్నారు.