యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణాలు, పల్లెల్లో వాడవాడలా పుట్టిన రోజు సంబరాలను జరుపుకొన్నారు. ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానం చేశారు. ఆస్పత్రులు, అనాథ ఆశ్రమాల్లో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశారు. రాయగిరిలోని కలెక్టరేట్ ఎదుట కూడా కట్ చేశారు. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా కంచర్ల రామకృష్ణా రెడ్డి దంపతులు ఆయుష్ హోమం నిర్వహించారు. భువనగిరి పట్టణ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. అక్కడి నుంచి రామలింగేశ్వర ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలేరులోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ప్రాంగణంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఆలేరులోని కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రాంగణంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. పోచంపల్లిలో కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంచారు.
మోటకొండూరులో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు, మోటకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. చౌటుప్పల్‌లో మిషన్ భగీరథ పైలాన్ వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలంలోని చిన్నకందుకూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్ధి విభాగం నాయకుడు వినయ్ పొలాల మధ్య డ్రోన్‌తో కేసీఆర్ ఫ్లెక్సీని ఎగురవేసి అభిమానం చాటుకున్నాడు. ఆత్మకూర్ (ఎం), అడ్డగూడూరు, ఆలేరు, బొమ్మలరామారం, తుర్కపల్లి, వలిగొండ, రామన్నపేట, సంస్థాన్‌నారాయణపురం మండలాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు స్థానికులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు చేశారు. నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలో యాదాద్రి పవర్‌ప్లాంటు వద్ద మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు.
నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని మెడికల్ కళాశాల ఎదుట మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి.. మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, మాజీ కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం, వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు అన్నదానం చేశారు. దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ సర్కారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేయడంతోపాటు పండ్లు పంపిణీ చేశారు.
మిర్యాలగూడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి కేక్ కట్ చేశారు. నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భారీ కేక్ కట్ చేశారు. అంతకుముందు ర్యాలీగా వెళ్లి వంద పడకల ఆసుపత్రి ప్రాంగంణలో మొక్కలు నాటారు. నకిరేకల్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నార్కెట్‌పల్లిలో జరిగిన వేడుకల్లోనూ చిరుమర్తి పాల్గొన్నారు. హాలియాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. అనంతరం మొక్కలు నాటారు.
రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. భగత్ కూడా రక్తదానం చేశారు. గుర్రంపోడు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను కట్ చేశారు. నందికొండలో ఎంసీ కోటిరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగానూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, ఎస్పీ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.