యాదగిరిగుట్ట, అక్టోబర్ 11 : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నియోజకవర్గంఅభివృద్ధి విషయంలో పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య విమర్శించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి నిధులు రాలేదన్నారు. ఇలాంటి వారికి ఎందుకు ఓటేశామా అన్న ఆలోచనకు ప్రజలు వచ్చారని తెలిపారు. శుక్రవారం పట్టణంలో బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలేరుకు సమీకృత గురుకుల పాఠశాలను ఎందుకు కేటాయించలేదో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే వినతిపత్రం అందజేసినా కేటాయింపులో న్యాయం జరుగులేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1,400 కోట్లతో ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించి, ప్రతి ఏటా బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. కేసీఆర్ సర్కారు యాదగిరిగుట్టకు 300 పడకల ఆసుపత్రితోపాటు 100 ఎంబీబీఎస్ సీట్ల మెడికల్ కళాశాల మంజూరు చేసిందన్నారు.
రూ.182 కోట్ల నిధులతో పరిపాలన అనుమతులు కూడా ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళాశాల నిర్మాణానికి ఇప్పటి వరకు శంకుస్థాపన చేయకపోవడంపై అనుమానాలకు తావిస్తుందని మండిపడ్డారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పేరిట మంజూరైన మెడికల్ కళాశాలను గుట్టలోనే కొనసాగించాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారో ఎమ్మెల్యే అయిలయ్య శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట కొండపైన బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ప్రారంభిస్తూ తామే చేశామంటూ కాంగ్రెస్ నేతలు గొప్పలకు పోతున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మల్లాపురం చెరువుకు గోదావరి జలాలు వచ్చాయని కొబ్బరికాయ కొట్టి పూజలు చేసిన ఎమ్మెల్యే అయిలయ్య మల్లాపురం గ్రామానికి గోదావరి జలాలు రాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆయన స్వగ్రామం సైదాపురం చెరువులోకి నీళ్లు విడుదల చేసేందుకు గండి చెరువుకు వచ్చే బస్వాపూర్ కాల్వకు గండి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆలేరు సాగు జలాలు పుణ్యం మాజీ సీఎం కేసీఆర్దేని గుర్తుచేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మేడబోయిన కాటంరాజు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మిట్ట వెంకటయ్య, నాయకులు ఆవుల సాయి, ఆరె శ్రీధర్ పాల్గొన్నారు.