– ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలి
– సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
సూర్యాపేట, జూలై 07 : కన్నెపల్లి పంప్ హౌస్‌ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మంగళవారం భారీ ఆందోళన నిర్వహించాయి. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ ముఖ్య నాయకుల నేతృత్వంలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, రైతులు కలెక్టరేట్ ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, ఇతర ముఖ్య నాయకులు మాట్లాడారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ప్రమాదం పొంచి ఉందని, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సకాలంలో నీరందించి రైతాంగాన్ని ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కన్నెపల్లి పంప్ హౌస్ పునరుద్ధరణను నిర్లక్ష్యం చేస్తూ కాళేశ్వరం జలాలను ఆపాలని కుట్ర పన్నుతోందని తీవ్రంగా విమర్శించారు. రైతుల పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, కావాలనే కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.
తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్‌ను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని, సాగునీటి విషయంలో రాజకీయం పక్కనబెట్టి , రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడితో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే గోదావరి జలాలను విడుదల చేయకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

‘కన్నెపల్లి పంప్ హౌస్‌ను తక్షణమే ప్రారంభించాలి’