యాదాద్రి భువనగిరి, మే 4 (నమస్తే తెలంగాణ) : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, మాజీ మంత్రి హరీశ్‌రావుపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. హరీశ్‌రావును తిట్టి ఐలయ్య పెద్దోడిని కావాలని అనుకుంటున్నాడని, తిడితే పెద్దోళ్లు కారని, ప్రజల మన్ననలు, ఆశీర్వాదం ఉండాలని హితవు పలికారు. దొంగ ప్రచారాలు మానుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసమే హరీశ్‌రావును దూషిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం భువనగిరిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఐలయ్య అక్రమ సంపాదన, క్రషర్లో కరెంట్ బిల్లులు ఎలా ఎగ్గొడుతున్నారో అందరికీ తెలుసని అన్నారు. అధికారులను బెదిరించి కరెంట్ బిల్లులు తక్కువ చేయించుకున్నారని, ఆయన భూదందాలు మాకు తెలియదా అని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలో ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా, రైతు బీమా, సన్నాలకు బోనస్ అమలు చేశామని అబద్ధాలు చెబుతున్నారు, ఐలయ్య మీ ఊరికి వస్తా నిరూపిస్తావా..? ఎంత మందికి అమలు కాలేదో నేను చెప్తా.. నియోజకవర్గంలో ఎక్కడికైనా పోదా ం.. చేశావని నిరూపిస్తావా..?’ అంటూ సవాల్ విసిరారు.
ఐలయ్యా నీ అనుభవమెంత.. రాజకీయాలకు ఎప్పుడొచ్చినవ్.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నవ్.. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఆలేరులో తిరగలేవు ఖబడ్దార్ బిడ్డా.. చిట్టా విప్పి, బాగోతం బయటపెడ్తం..’ అని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, మంత్రి పదవులు కావాలంటే సీఎం దగ్గర చెంచాగిరీ చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన వాటికి మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదని, రైతు వంచన పాలన అని విమర్శించారు. ఎవర్ని ఉద్ధరించారని రైతు వేడుక కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కరెంట్ కోతలు, రుణమాఫీ, రైతుభరోసా, బీమా, సక్కగా యూరియా ఇవ్వనందుకా ఉత్సవాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐలయ్య బినామీ హరికృష్ణ అని, చల్లూరు గుట్టల్లో క్రషింగ్‌పై ఆరోపణలు వస్తే ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. భూ దందాల ఐలయ్య భూమి కనిపిస్తే వాలిపోతున్నడని, బొమ్మలరామారం మండలంలో అన్నదమ్ముల పంచాయతీలో జోక్యం చేసుకొని.. భూములను బినామీ పేరున రాయించుకున్నారని ఆరోపించారు. గుట్టపై వర్తక దుకాణాల కోసం ఒక్కొక్కరి నుంచి 50 వేల చొప్పున 70 లక్షలు వసూలు చేశారని ఆరోపిస్తే.. ఇప్పటి దాకా చడీచప్పుడు లేదన్నారు. సమావేశంలో జనగాం పాండు, కర్రె వెంకటయ్య, జి.శ్రీను, యాదగిరి, వెంకటేశ్, ఏవీ కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, వస్పరి శంకరయ్య, చింతల కిష్టయ్య, రమేశ్, లక్ష్మీనారాయణ గౌడ్, వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు.