కరువు సమయానికి కాళేశ్వరం జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చి చేరుతున్నాయి. వేసవి కాలంలో సైతం చెరువులు జలకళ సంతరించుకున్నాయి. యాసంగి సీజన్లో రైతులకు సాగునీటి సమస్య రాకుండా చూడాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల సాకారం అవుతున్నది. మాజీ సీఎం కేసీఆర్ దూర దృష్టితో ఈ మధ్య కాలంలో వర్షాలు లేక ఎండిపోతున్న చెరువుల్లోకి బిరబిరా అంటూ గోదారమ్మ వచ్చి చేరుతున్నది. వర్షాలు లేకపోయినా పంటల సాగు చేస్తామన్న సంకల్పం రైతుల్లో కలుగుతున్నది.
గత జనవరి 30వ తేదీన సిద్దిపేట జిల్లా మర్కూర్ వద్ద కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి, ఎం. తుర్కపల్లి కాల్వలో 1.50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని 12 చెరువులు నింపగా 1,496.24 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతున్నది. ఎం.తుర్కపల్లి ప్రధాన కాల్వ ద్వారా తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని 19 చెరువులు నింపగా 1,496.24 ఎకరాలకు సమృద్ధిగా సాగు నీరు అందుతున్నది. రైతులు రంది లేకుండా యాసంగి పంటలు పండించుకుంటున్నారు.
కొండ పోచమ్మ సాగర్ నుంచి నీటి విడుదలతో తుర్కపల్లి(ఎం) మండలంలోని గోపాల్‌పూర్‌లోని పోచమ్మ చెరువు 45 శాతం, చిన్నలక్ష్మాపూర్లోని ధాపల్ చెరువు 35 శాతం, మాదాపూర్‌లో జగ్గయ్యచెరువు 30 శాతం, కొత్తచెరువు 50 శాతం, గోపాల్‌పూర్‌లోని పొట్టొని కుంట చెరువు 100 శాతం నిండింది. బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలో రామసామితండా చౌటకుంట 30 శాతం, నల్లచెరువు 10 శాతం, ఎర్రకుంట 20 శాతం, తిమ్మాపూర్‌లోని గూడెంచెరువు 25శాతం, తిమ్మప్ప చెరువు 50 శాతం, ప్యారారంలోని మల్లన్న చెరువు 20 శాతం, సోలిపేటలోని ఊరు చెరువు 20 శాతం నిండింది.
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి కొత్తకుంట 18శాతం, పత్తి చెరువు 95 శాతం, మైసమ్మకుంట 100 శాతం, బండదరాణి కుంట 98శాతం, చాపలకుంట 100 శాతం, తుర్కపల్లిలోని బహుదురియా చెరువు 77 శాతం, వెంకటాపూర్‌లోని సుదినేని చెరువు 25శాతం, తోక చెరువు 20 శాతం, మల్కాపూర్‌లోని ఇప్పకుంట 97శాతం, రాళ్లవానికుంట 95 శాతం, ముల్కలపల్లిలోని చౌదరికుంట 20శాతం, కుమ్మరికుంట 10శాతం, ధర్మారంలోని విట్టల్ చెరువు, గోవిందు చెరువు, గొల్లగూడెంలో కపాల్ చెరువు, కొత్త చెరువు, పటేల్ చెరువు 100 శాతం, పల్లెపహాడ్‌లోని సోమయ్య చెరువు 100 శాతం, బొమ్మలరామారం మండలంలోని మల్లారెడ్డి చెరువు 77శాతం కాళేశ్వరం జలాలతో నిండాయి. మరికొన్ని రోజుల్లో ఆయకట్టు చెరువులను వంద శాతం నింపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాకు సాగు జలాలు అందించాలన్న లక్ష్యంతో స్థానిక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి 2020లో తుర్కపల్లి ప్రధాన కాల్వకు కొండపోచమ్మ సాగర్ జలాలను విడుదల చేయించారు. 2023లో ఎం.తుర్కపల్లి కాల్వకు సైతం నీటిని విడుదల చేశారు. నాటి నుంచి పలు దఫాలుగా జిల్లాలోని రెండు మండలాలకు కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. వ్యవసాయానికి నీళ్లు అందే పరిస్థితి లేదు. గతేడాదితో పోలిస్తే తుర్కపల్లిలో 3.55 మీటర్లు, బొమ్మలరామారంలో 2.62 మీటర్లు పాతాళగంగ పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల వరి పంట ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత జనవరి 30న ఇరిగేషన్ అధికారులు కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు.