సూర్యాపేట, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ‘గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలతో ఓట్లు వేయించుకొని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ఓ ఢోకాబాజీ. కాంగ్రెస్ బోగస్.. బ్రోకర్ మాటలు మాట్లాడుతోందని ప్రజలు గుర్తించారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అందుకే రెండేండ్ల పాలన తిరక్కముందే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గులాబీ జెండానే అండగా ఉంటుందన్నారు. శనివారం నియోజకవర్గంలోని ఆత్మకూర్.ఎస్ మండలం పాతర్లపహాడ్, పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెం, చివ్వెంల మండలం ఎంజీ నగర్‌తండా గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు.
వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 2014 తరువాతనే మన గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. గతంలో మంచినీళ్ల కోసం పడిన కష్టాలు మర్చిపోతామా? గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కోక్కటిగా ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని గుర్తు చేశారు. కేసీఆర్ ముందు చూపుతోనే గ్రామాల్లో అభివృద్ధి ఫలాలు చేకూరాయన్నారు. మొదటి నుంచి కేసీఆర్‌కు రైతులు, మహిళలు, పెన్సన్దారులే అండగా నిలిచారని గుర్తు చేశారు. అందుకే కాంగ్రెస్ మా యమాటలు చెప్పి రైతులు, పెన్షన్‌దారులను దూరం చేసిందన్నారు. నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసంతో అధికారం చేపట్టి రెండేండ్ల పాలన పూర్తయినా గ్రామాల్లో కాంగ్రెస్ ఐదు పైసల పని చేయలేదన్నారు. ‘పెన్షన్లు పెంచలేదు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఊసే లేదు.
యువతులకు స్కూటీలు, మహిళలకు రూ.2,500 సాయం అటకెక్కింది. వడ్లకు బోనస్ పెద్ద బోగస్ అయ్యింది’ అని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇండ్లల్లో పెద్ద మోసమే జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే రోడ్డున పడటం తప్ప ఒరిగేదేమి లేదన్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చినంక మళ్లీ రౌడీయిజం, అరాచకాలు పెరిగాయన్నారు. ‘కాంగ్రెస్ పాలన అంటే అమావాస్య పీడకలలే. మళ్లీ రెండేండ్లల్లో మనమే అధికారంలోకి రాబోతున్నాం. మరో 20 ఏండ్లు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటది. కేసీఆర్ అండతో గులాబీ నీడలో ప్రశాంత వాతావరణంలో మళ్లీ అబివృద్ధి కొనసాగించుకుందాం. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుందాం’ అని పిలుపునిచ్చారు.
ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. టీఆర్పీకి చెందిన మాజీ సర్పంచ్‌తో పాటు 200 మంది కార్యకర్తలు ఆత్మకూర్.ఎస్ మండలలోని పాతర్లపహాడ గ్రామంలో గులాబీ గూటికి చేరారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాతర్లపహాడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఆరేంపుల ఉపేంద్ర సైదులును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సైదులు 2001 నుంచి ఉద్యమ నాయకుడిగా కొనసాగుతూ పార్టీ కోసం కష్టపడుతున్నారని చెప్పారు. ఉపేంద్ర సైదులును గెలిపించుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మాజీ సర్పంచ్ కేశబోయిన మల్లయ్యయాదవ్, మాజీ ఎంపీటీసీ పరకాల ఉపేందర్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, కొంగలి మధుసూదన్, మాజీ ఉప సర్పంచ్ కొంగలి జానయ్య, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.