– మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 06 : పట్టణంలో వార్డుకు కౌన్సిలర్‌ను ఎన్నుకోవడం అంటే మీ ఇంట్లో మనిషిని ఎన్నుకోవడమేనని, ఫోన్ చేస్తే మీ ఇంటి ముందుకు వచ్చే వాళ్లు ఎన్నిక కావాలని, అప్పుడే మీ ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని.. మీ ఓటుకు న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 16, 18వ వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 ఏళ్ల సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో భారీ ఎత్తున చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి మనిషిని వదిలి బయటి వ్యక్తికి అవకాశం ఇవ్వొద్దన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. 30 సంవత్సరాలుగా మూసి మురికి నీటిని తాగిన ప్రజలకు స్వచ్ఛమైన కృష్ణా నీటిని మిషన్ భగీరథ ద్వారా అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీయిజం, గుండాయిజం, దందాలు పెరిగాయని అలాగే వాళ్లు మన ఆస్తులు తింటుంటే వాళ్లు పెంచిన దోమలు మన రక్తం పిలుస్తున్నాయన్నారు.
గత రెండేళ్లలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూపాయి పని చేయలేదని ఎక్కడా తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. దొంగలంతా ఒక్కటై వార్డులు పంచుకున్నారని, కొట్టే చేతికి ఆయుధం.. దొంగ చేతికి తాళం ఇవ్వవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకి రూ.2,500 వస్తాయని ఆశపడ్డారని, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు వస్తాయని కన్న కలలు కల్లలుగా మిగిలాయన్నారు. ప్రజలు అన్ని గమనించాలని మీ ఇంటి ముందు ఉంటూ మీరు పిలిస్తే వచ్చే వ్యక్తిని కౌన్సిలర్ గా గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇస్లావత్ రామచందర్ నాయక్, ఆయా వార్డుల అభ్యర్థులు రంగినేని ఉపేందర్ రావు, వాంకుడోత్ సక్రు నాయక్, నాయకులు రాంబాబు, డాక్టర్ బక్కయ్య, అమృనాయక్, గౌతమ్, నరేష్, జ్యోతి, సరస్వతి పాల్గొన్నారు.

‘కొట్టే చేతికి ఆయుధం.. దొంగ చేతికి తాళం ఇవ్వొద్దు’