నల్లగొండ ప్రతినిధి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : శాసనసభా సమావేశాల వేదికగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని చెడుగుడు ఆడారు. నిత్యం ఏదోక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండాలనుకోవడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పరిపాటే.
ఈ క్రమంలోనే ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ మీద అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సోమవారం ఇదే తరహాలో అసెంబ్లీ వేదికగా సబ్జెక్టుకు సంబంధం లేకుండా వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మర్డర్ కేసులు, క్రిమినల్ కేసులు అంటూ ఏదోదే మాట్లాడబోయారు.
ఇవే విషయాలు గత పదేండ్లుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెబుతూనే వస్తున్నారు. మళ్లీ ఎప్పటివో పాత విషయాలను ప్రస్తావించబోగా జగదీశ్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎదురుదాడికి దిగుతూ సవాళ్లు విసిరారు. ప్రస్తుతం తన మీద ఒక్క కేసు ఉన్నట్లు నిరూపించినా అసెంబ్లీలో ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. నిరూపించకపోతే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ సీట్ల నుంచి స్పీకర్ పోడియం వరకు ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపైనా జగదీశ్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్‌తో ఎదురుదాడికి దిగడం సభలో హైలెట్‌గా నిలిచింది. తమ అధినేత కేసీఆర్ సత్యహరిచంద్రుడేనంటూ రేవంత్ మాదిరిగా సంచులు మోసి జైలుకు వెళ్లిన చంద్రుడు కాదని సెటైర్ వేశారు. ‘చర్లపల్లి జైలు జీవితం రేవంత్‌కు అనుభవం కాబట్టే ఆయన మళ్లీ దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నేను జైలు జీవితం గడిపా. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి చంచల్‌గూడ జైలుకు వెళ్లాను.
కానీ సీఎం రేవంత్‌రెడ్డికి చర్లపల్లి జైలు జీవితమే గుర్తు ఉంటుంది’ అని తీవ్రంగా స్పందించారు. తాము మాట్లాడిన ప్రతి మాటనూ అసెంబ్లీ నుంచి ప్రజలకు చూపించాలని స్పీకర్‌ను కోరారు. ‘నాపై మూడు హత్య కేసులు ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే పెట్టారు. ఆ మూడింటిలో కోర్టు నన్ను నిర్దేషిగా తేల్చింది. ఇవి కాకుండా ఏమైనా ఉంటే హౌస్ కమిటీ వేసి విచారణ జరపాలి.
మంత్రి కోమటిరెడ్డి చెప్పిన రెండు కేసుల్లో ఒక్కటి ఉన్నా ముక్కుకు నేలకు రాసి రాజీనామా చేస్తా’నని స్పష్టం చేశారు. తమపై సీఎం, మంత్రులు చేసే విమర్శలను ప్రజలకు చూపినట్లే తమ మాటలను కూడా ప్రజలకు చూపించాలని స్పీకర్‌ను కోరారు. సీఎం సభలోకి వచ్చాకే సబ్జెక్ట్ డీవియేషన్ అయ్యింది తప్ప తనతో కాదని జగదీశ్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
కేసీఆర్ గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఆయన కాలి గోటికి సరిపోతారా అధ్యక్షా అంటూ కౌంటర్ల మీద కౌంటర్లు వేసి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. అవన్నీ సోమవారం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా వైరల్ అయ్యాయి.