సూర్యాపేట, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : ఏడాది కాలం తర్వాత తొలి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తన ప్రసంగాన్ని మెల్లమెల్లగా మొదలు పెట్టి ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేశారు. సుతిమెత్తగా సూదులు గుచ్చుతూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం సందర్బంగా సూర్యాపేట మండలం కేటీఅన్నారం గ్రామంలో ఆదివారం జరిగిన సభకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొనగా స్థానిక ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి కూడా హాజరయ్యారు. అధికారిక కార్యక్రమంలో ప్రతిపక్షంలో ఉన్న జగదీశ్‌రెడ్డి ఏం మాట్లాడుతారు..? ఎలాంటి పద ప్రయోగాలు ఉంటాయి..? అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఎన్ని సెటైర్లు వేస్తారా అని అక్కడున్న ప్రజలతోపాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు వేచి చూశారు. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి పాలన సాగించాలని, ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రసంగం ప్రారంభించారు. తొలిరోజు సంక్షేమ పథకాలను అందుకుంటున్న వారికి అభినందనలు చెప్పారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఏదీ దానం ఇవ్వదని, ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించాలని, ఎన్నికలకు ముందు విడుదల చేసే మ్యానిఫెస్టోను నెరవేర్చే బాధ్యతను వంద శాతం చేసి తీరాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఈ సభకు వచ్చి ఎదురుగా ఉన్న మహిళలకు రూ.2,500 వస్తేనే మహాలక్ష్మి పథకం అమలు చేసినట్లు అని, ప్రతి అర్హత ఉన్న మహిళకు రూ.2,500ల ఇవ్వాలని సభా వేదికపై ఉన్న మంత్రి తుమ్మల ఎదుట డిమాండ్ చేశారు.
అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం మంచిదే కానీ, ఈ స్కీమ్ వల్ల ఆటోవాలా పరిస్థితి దీనంగా మారి ప్రతి నిత్యం ఆత్మహత్యలు వెలుగులోకి వస్తున్నాయని, ప్రతి ఆటో కార్మికుడికి హామీ మేరకు రూ.12వేలు ఇవ్వాలని మంత్రికి సూచించారు. ఇక ఉపాధిహామీ కూలీలకు నిబంధన పేరిట ఏదో కొద్దిమందికి కాకుండా అందరికీ పింఛన్ ఇవ్వాలని కోరారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన ప్రభుత్వం గతంలో తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే భర్తీ చేసి అరకొరగా నియామకాలు చేపట్టిందని, ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఎవ్వరికి అన్యాయం జరిగినా నేను అండగా ఉంటా.. అందరం కాలిసి కొట్లాడుదాం అని సభా వేదిక ద్వారా జగదీశ్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆదాయ వనరులు, నిధులు చూసుకోవడం, ప్రాధాన్యత అంశాలను ఎంచుకోవడం, ఇలా అన్నీ చక్కదిద్దుకోవడం కోసం ప్రతిపక్షంగా ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తుంటారని, అలాగే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల గడువు ఇచ్చిందని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తారని, అందుకే ఆరు నెలలు కాదు మరో ఆరు నెలల గడువు ఇవ్వాలని, అప్పటి వరకు పార్టీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వంద శాతం అమలు చేయాలని మరో సారి డిమాండ్ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా ఎలాంటి పిలుపులు ఇవ్వకముందే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనల పేరిట రోడ్లపైకి వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయం పూర్తయినందున ఇక బీఆర్ఎస్ రంగంలోకి దిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు తప్పవని చెప్పారు.