Ration Dealers | నల్లగొండ, ఫిబ్రవరి 25 : నల్లగొండ రెవెన్యూ డివెజన్లో ఖాళీ అయిన రేషన్ డీలర్ల భర్తీ కోసం ఇటీవల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా అర్హుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అర్హత పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినా ఇంటర్వ్యూలో జీరో మార్కులు వేసి అనర్హులను ఎంపిక చేసినట్లు తెలుపుతున్నారు. డిగ్రీ, పీజీ చదివిన వారి కంటే పదో తరగతి చదివిన వారికి, కాంగ్రెస్ పార్టీ అనుచరులనే ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. దీనిపై పలువురు బాధితులు సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
నల్లగొండ రెవెన్యూ డివిజన్లో మొత్తం 20 గ్రామాల్లో రేషన్ డీలర్ల నియామకాలకు ప్రభుత్వ సూచన మేరకు అధికారులు గతేడాది డిసెంబర్ 31న పదో తరగతి అర్హతగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 12న 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ నెల 12న మరో 20 మార్కులకు ఇంటర్యూ చేపట్టిన అధికారులు ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఈ నెల 13న ఎంపికైన వారి జాబితాను ప్రకటించారు. తుది దశగా నిర్వహించిన ఇంటర్యూలో పీజీలు, డిగ్రీలు చదివి అత్యధిక మార్కులు పొందిన వారికి జీరోలు వేసి, పదో తరగతి చదివి అత్యల్ప మార్కులు పొందిన వారికి 20కి 20 మార్కులు వేశారు. దాంతో రేషన్ డీలర్ల పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో నిరాశ ఎదురైంది.