హుజూర్నగర్, మే 22 : తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెర లేపిందని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజవకర్గ సమన్యయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి విమర్శించారు. పట్టణంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులు, బ్యారేజీ, డ్యామ్‌లకు తేడా తెలియని, కనీస అవగాహన లేని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండడం రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణలో 50లక్షల ఎకరా పంట పొలాలను కోటి ఎకరాలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కు నిదర్శనమనారు.
మరో 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని తెలిసే సీఎం రేవంత్ సహా మంత్రులు దండుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పదేండ్లు అద్భుతమైన పాలన అందించిన కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై యావత్ తెలంగాణ ప్రజలు మండి పడుతున్నదన్నారు. అనంతరం హుజూర్‌నగర్‌లో ఇటీవల మృతి చెందిన ధనమూర్తి చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఒంటెద్దు పరామర్శించారు. పదో వార్డులో ఇటీవల గాయపడిన జడ అంజిని పరామర్శించారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లకొండ అమర్, సీనియర్ నాయకులు కేఎల్ఎన్రెడ్డి, నాయకులు రామిశెట్టి రాము, చంటి, నరసింహారావు, రహీమ, ఉష, వెంకటేశ్ ఉన్నారు.