– కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణకు రాజకీయ, రైతు నాయకుల వినతి
కోదాడ, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వీటిని వెంటనే అరికట్టాలని కోదాడ నియోజకవర్గ వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. మిల్లర్లు 70 కిలోల బస్తాకు కిలో తరుగు పేరుతో, టన్నుకు 5 కిలోల చొప్పున నికర బరువులో తగ్గిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రైవేటు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు బస్తాకు రెండున్నర కిలోల వరకు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎంటీ, చింట్లు వంటి సన్న రకాలను మద్దతు ధర కంటే రూ. 200 నుండి 300 తక్కువకు కొనుగోలు చేస్తున్నారని, దీనిపై మిల్లర్లు, వ్యాపారులతో తక్షణమే సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలను నివారించి రైతులకు న్యాయం చేయాలన్నారు. స్పందించిన ఆర్డీఓ సోమవారం రోజున రైతులు, కమీషన్ ఏజెంట్లు, ధాన్యం వ్యాపారుస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బొల్లు ప్రసాద్, కనగాల నారాయణ, దొడ్డ వెంకటయ్య, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, ముత్యాలు, నరసింహారావు, రైతులు కమతం రాజేశ్వరరావు, వీరేపల్లి కృష్ణమూర్తి, బొమ్మ కంటి వీరబాబు, బైరాబోయిన వెంకటేశ్వర్లు, చిట్టిబాబు, కిరణ్ రెడ్డి పాల్గొన్నారు.