ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ పనులు మొదలుపెట్టాలంటే అన్నదాతను ముందుగా పెట్టుబడి భయం వెంటాడేది. ఊళ్లోని షావుకార్లు, లేదంటే వడ్డీ వ్యాపారుల చుట్టూ పాస్‌పుస్తకాలు పట్టుకుని చెప్పులరిగేలా తిరుగాల్సి వచ్చేది. సకాలంలో వర్షాలు కురిసినా చేతిలో డబ్బులు లేక సాగుకు అదును దాటేది. స్వయాన రైతు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో ఆ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టారు. రైతు బంధు ద్వారా పంటలకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. 2018 వానకాలంలో మొదలైన రైతుబంధు నిరాటంకంగా కొనసాగుతున్నది. ప్రస్తుత వానకాలానికి సంబంధించి 11వ సీజన్ రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి టింగ్ టింగ్ మంటూ రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. తొలిరోజు ఎకరంలోపు రైతులందరికీ నగదు బదిలీ జరిగింది. ఉమ్మడి జిల్లాలో 1.89లక్షల ఎకరాలకు చెందిన 3.18 లక్షల మంది రైతులకు రూ.94.97 కోట్లు అందాయి. మంగళవారం రెండెకరాల్లోపు రైతుల ఖాతాల్లో నగదు పడనున్నది. పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకూ సర్కారు సాయం అందనున్నది.
– నల్లగొండ ప్రతినిధి, జూన్ 26 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : వానకాలం రైతుబంధు పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. సోమవారం నుంచే రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. పది, పదిహేను రోజుల్లోనే అందరికీ డబ్బులు జమ చేసి పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ వానకాలంలో సుమారు 1300 కోట్ల రూపాయలను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలిరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లా రైతులకే రైతుబంధు డబ్బులు అందాయి. సోమవారం ఎకరంలోపు ఉన్న రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఉదయం 9గంటల నుంచే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నట్లుగా మెసేజ్‌లు రావడం మొదలైంది. ఎకరంలోపు ఉన్న రైతులందరికీ మధ్యాహ్నానికే డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొలి రోజు 1,89,952 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 3,18,523 మంది రైతులకు 94,97,63,924 రూపాయల నగదు వారి ఖాతాల్లో జమ అయ్యింది. ఇందులో ఒక్క నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 1,49,639 మంది రైతులకు 90,671 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన 45,33 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా అందింది. సూర్యాపేట జిల్లాలో 89,342 మంది రైతుల ఖాతాల్లో 27.79 కోట్ల రూపాయలు 55,585 ఎకరాల విస్తీర్ణం గల భూములకు సంబంధించి నగదు జమ అయ్యింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 43,695 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన 79,542 మంది రైతులకు 21.84 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం జమ చేసింది. పథకం ప్రారంభం నుంచి సీజన్ సీజన్‌కూ ఉమ్మడి జిల్లా రైతాంగానికి రైతుబంధు ద్వారా అందుతున్న పెట్టుబడి సాయం అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నది. ఈ వానకాలంలో గతంలో ఎన్నడూ లేనంతటి సాయం ఉమ్మడి జిల్లా రైతులకు అందనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో సుమారు 11లక్షల మంది రైతులకు రూ.1300 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 16వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు సైతం దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు దరఖాస్తుల స్వీకరణ పనిలో నిమగ్నమయ్యారు. వీరితోపాటు ఈ నెల 30వ తేదీ నుంచి పోడు రైతులకు పట్టాలిచ్చాక వారి భూములకు కూడా రైతుబంధు వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వారు కూడా ఈ సీజన్లో అదనంగా కొత్త లబ్ధిదారులు కానున్నారు. నేడు రెండెకరాలలోపు రైతులకు, తర్వాత రోజుల్లో వరుసగా మూడు, నాలుగు.. ఇలా చివరి రైతు వరకు రైతుబంధు పథకం డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా దశల వారీగా మొత్తం పది నుంచి పదిహేను రోజుల్లోపే పట్టాదారు పాసుపుస్తకం ఉండి వివరాలు అందజేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
అన్నదాతల హర్షం
ఎప్పటిలాగే సీజన్ ఆరంభంలో రైతుబంధు డబ్బులు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల సంబురాలు కూడా జరుపుకొన్నారు. ఎకరాకు ఐదు వేల రూపాయలు ఇస్తుండడంతో సాగుకు అవసరమైన దాదాపు పెట్టుబడి సమకూరుతుందని రైతులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా సావుకార్లు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. నేల స్వభావానికి అనుగుణంగా పంట వేయడంలోనూ, దాన్ని మార్కెట్లో మద్దతు ధరకు అమ్ముకోవడంలోనూ తమకే స్వేచ్చ లభించిందని సంబురపడుతున్నారు. గతంలో పెట్టుబడి ఇచ్చిన ప్రైవేటు వ్యాపారులకే తమ పంటలు అమ్మాల్సి ఉండేదని, రైతుబంధు పథకం వచ్చిన నాటి నుంచి ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. స్వయంగా రైతు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ అవసరాలకు తగ్గట్లు పథకాలు అమలు చేస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నారని కర్షకులు అభినందిస్తున్నారు. సీఎం కేసీఆర్‌తోనే వ్యవసాయం లాభసాటిగా మారి తమ జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా16వేల మందికి..
గత యాసంగితో పోలిస్తే ఈ సీజన్లో అదనంగా 16,064 మంది రైతులకు కొత్తగా రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి. ఆరు నెలల్లోనే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగడం గమనార్హం. గత యాసంగి సీజన్లో డిసెంబర్ 28న తొలి రోజు ఎకరంలోపు పెట్టుబడి సాయంతో పోలిస్తే ఈ సీజన్‌కు వచ్చేసరికి తొలిరోజుకు ఎకరాల్లో, రైతుల సంఖ్యలో, నగదు జమలో భారీ పెరుగుదల కనిపిస్తున్నది. యాసంగి సీజన్లో తొలిరోజు ఎకరంలోపు 3,02,459 రైతులకుగాను 1,82,330 ఎకరాలకు సంబంధించిన 91.16 కోట్ల రూపాయల నగదు జమ అయ్యింది. ప్రస్తుత వానకాలం తొలిరోజు సోమవారం 3,18,523 మంది రైతులకుగాను 1,89,952 ఎకరాలకు సంబంధించిన 94.97కోట్ల రూపాయలు నగదు జమ అయ్యింది. అంటే 16,064 మంది కొత్త రైతులకు చెందిన 7,622 అదనపు ఎకరాలకు అదనంగా 3.81కోట్ల రూపాయల నగదు ఒక్క సీజన్‌కే పెరుగడం గమనార్హం. సీజన్ సీజన్‌కూ రైతుల సంఖ్య, భూమి విస్తీర్ణం, నగదు లబ్ధి అంతకంతకూ పెరుగుతూ పోతున్నట్లు స్పష్టమవుతున్నది.
రైతుబంధుతో అప్పుల బాధ తీరింది
ఒకప్పుడు పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల ఇంటి చుట్టూ తిరిగేది. రైతుల బాధలను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నరు. రైతు బంధు పైసలు రాగానే విత్తనాలు, ఎరువులు కొని అనుకున్న టైమ్‌కు నాట్లు వేసుకుంటున్నాం. పండిన పంటను కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరకు తీసుకుంటున్నరు. సీఎం కేసీఆర్ వచ్చినంకనే రైతుల కష్టాలు తీరినయి. తొమ్మిదేండ్లలో విత్తనాలు, ఎరువుల కోసం అప్పు తేలేదు. నాకు 30 గుంటల భూమి ఉంది. రైతు బంధు డబ్బులు 3,200 రూపాయలు పడ్డయి. ఇక సంతోషంగా సాగు పనులు చేస్తా.
– రమావత్ కిషన్ నాయక్, రైతు, గుర్రపుతండా, కొండమల్లేపల్లి మండలం
ఇప్పుడు పెట్టుబడి బాధల్లేవు
పంటల పెట్టుబడికి ఎకరానికి రూ.5వేలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబాంధవుడయ్యాడు. గత ప్రభుత్వాలు రైతులను ఏనాడూ పట్టించుకోలేదు. ఒకప్పుడు పెట్టుబడి కోసం దళారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగేది. కానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సీజన్లో రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడంతో ఆ బాధలు తీరాయి. నా పేరు మీద 10 గుంటల పొలం ఉండగా.. సోమవారం నా బ్యాంకు ఖాతాలో రూ.1,250 జమ అయ్యాయి.
– బెల్లంకొండ లక్ష్మమ్మ, మహిళా రైతు, చిలుకూరు
వ్యవసాయాన్ని పండుగ సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసాతోనే నాకున్న 30గుంటల భూమిలో ఆనందంగా వ్యవసాయం చేస్తున్నా. రైతుల కష్టాలను గుర్తించి దండుగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. గత ప్రభుత్వాల హయాంలో నీళ్లు లేక, పంటలు పండక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కొద్దిపాటి నీళ్లున్నా అప్పులు చేసి పెట్టుబడి పెట్టేవాళ్లం. వచ్చిన పైసలు మిత్తికి కూడా సరిపోయేవి కాదు. కానీ.. కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు, రైతుబంధు ద్వారా పెట్టుబడికి డబ్బులు, 24గంటల ఉచిత కరెంట్, రైతుబీమా వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు రైతాంగమంతా రుణపడి ఉంటుంది.
– యల్మకంటి సత్తయ్య, రైతు, వర్ధమానుకోట, నాగారం మండలం
రైతు బంధే ఆదుకుంటున్నది
వానకాలం సాగుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే డబ్బులే ప్రధాన ఆధారం. నాటి రోజుల్లో మా నాన్న వ్యవసాయం చేయాలంటే విత్తనాలు, యూరియా కోసం సావుకార్ల వద్ద అప్పులు తెచ్చేది. కరెంట్ రాక, పంట చేతికందక పడరాని పాట్లు పడేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ కొన్నేండ్లుగా సాగుకు ముందే డబ్బులు ఎకౌంట్లలో వేస్తుండడంతో అప్పుల బాధ నుంచి విముక్తి కలిగినట్లయింది. నాకు రైతుబంధు కింద 16గుంటల భూమికి రూ.1875 పడ్డాయి. ఇంకా 2ఎకరాలకు పడాల్సి ఉంది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– శేషరాజుపల్లి వెంకన్న, ఇటుకల పహాడ్, శాలిగౌరారం
11వ సారి రైతుబంధు డబ్బులు పడ్డయి
నాకు ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ప్రతి 6నెలలకోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నారు. 11వ సారి సోమవారం రూ.5వేలు నా బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతుబంధు ఇచ్చి ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్. రైతుబంధు డబ్బులు ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పెట్టుబడి కోసం ఎలాంటి అప్పులు చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సహాయంతో రంది లేకుండా సాగు చేసుకుంటున్నాం.
– ఉగ్గె మల్లయ్య, ఆత్మకూరు(ఎం)
మొదటిసారి నాకు రెతుబంధు పైసల్ వచ్చినయ్
గతంలో నా పేరు మీద భూమి లేకుండె. గత ఏడాది మా నాన్న పేరున ఉన్న మూడెకరాల భూమిని నాకు, మా ఇద్దరి అన్నలకు తలా ఎకరం చొప్పున గిఫ్ట్ డీడ్ చేశాడు. రైతుబంధు కింద సోమవారం 5వేల రూపాయలు నా ఖాతాలో జమ అయ్యాయి. మొదటిసారిగా రైతుబంధు డబ్బులు పడడంతో సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ ఇస్తున్న పెట్టుబడి సాయంతో ఎంతో మంది రైతులు సంతోషంగా ఉంటున్నారు.
– ఉప్పల రవికుమార్, చందనపల్లి (నల్లగొండ రూరల్)
సీఎం కేసీఆర్ సాయం మరువలేనిది
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అందించే సహాయం మరువలేనిది. కాలం మొదలు కాకముందే రైతుల అకౌంట్లలో రైతుబంధు డబ్బులు వేసిన చరిత్ర దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. మా గ్రామంలో నాకు నాలుగు గుంటల భూమి ఉండగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రతి సంవత్సరం రూ.వెయ్యి రూపాయలు పడుతున్నాయి. 26వ తారీఖు డబ్బులు పడుతాయని ప్రభుత్వం ప్రకటించినట్లుగానే నా ఖాతాలో ఉదయమే డబ్బులు పడ్డాయి. నాకున్న కొద్దిపాటి భూమికి కూడా పెట్టుబడి సాయం అందించడం గొప్ప విషయం. రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– ధూపాటి యాదయ్య, రైతు, కొణతాలపల్లి, త్రిపురారం మండలం