భువనగిరి అర్బన్, జూలై 7: లింగనిర్థారణ పరీక్షలు నేరమని తెలిసినా డబ్బు కోసం కొందరు వైద్యులు, స్కా నింగ్ సెంటర్ల యజమానులు అబార్షన్లు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎస్వోటీ పోలీసుల దాడిలో ఈ విషయాలు వెలుగుచూశాయి. జిల్లా కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు, లింగ నిర్థారణ పరీక్షలు చేస్తున్న దవాఖానలు, ల్యాబ్‌లపై ఆదివారం అర్థరాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్వోటీ పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారు తెలిసిన వివరాల ప్రకారం…ఇద్దరు వివాహితలు వేర్వేరుగా పట్టణంలోని శ్రీ లక్ష్మీనర్సింహస్వామి స్కానింగ్ సెంటర్లో జూన్ 30న, జూలై 3న స్కానింగ్ చేయించుకోగా వారికి పుట్టబోయేది ఆడ పిల్ల అని నిర్థారణ అయింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు మహిళలు వేర్వేరుగా గాయత్రి ప్రైవేటు దవాఖానలోని వైద్యుడు శివకుమార్‌ను కలిశారు. దీంతో ఆయన వారికి ఆదివారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేసి దవాఖానలోనే అబ్జర్వేషన్లో ఉంచారు. సమాచారం తెలుసుకున్న ఎస్వోటీ పోలీసులు దవాఖానలో దాడులు నిర్వహించి ఆబార్షన్ చేయించుకున్న మహిళలను ఆరా తీయగా నిజమేనని తేలడంతో డాక్టర్ శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
తీరు మార్చుకోని వైద్యులు..
గాయత్రి దవాఖాన, శ్రీలక్ష్మీనర్సింహస్వామి ల్యాబ్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద, పట్టణ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీ చేశారు. డాక్టర్ శివకుమార్ గాయత్రి దవాఖానను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. దీంతో విశ్వసనీయ సమాచారం అందుకున్న వైద్యబృందం, ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఇద్దరు వివాహితలకు అబార్షన్ చేసిన విషయం నిర్థారణ కావడంతో దవాఖాన అనుమతి పత్రాలను, రికార్టులను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో యశోద తెలిపారు. అనంతరం శ్రీ లక్ష్మినర్సింహస్వామి ల్యాబ్‌ను సీఐ రమేశ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయత్రి దవాఖానలో అబార్షన్ జరిగిన మహిళలు గతనెల 30, ఈనెల 3న ఈ ల్యాబ్‌లోనే స్కానింగ్ చేయించుకున్నట్లు రికార్డులో పేర్లు నమోదై ఉన్నాయని, ఆ ఆధారంతో ల్యాబ్‌ను సీజ్ చేసి, ల్యాబ్ యాజమాని దంతూరి పాండును అదుపులోకి తీసుకున్నామన్నారు. డాక్టర్లు శివకుమార్, గాయత్రి, ల్యాబ్ యాజమాని పాం డుతోపాటు మహిళలపై కేసు నమెదు చేశామని, పూర్తి సమాచారం కోసం విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. శివకుమార్‌ను రిమాండ్‌కు పంపించామన్నారు.