చందంపేట (దేవరకొండ), ఆగస్టు 08 : దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనామత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తిచేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
పూర్తిచేసిన ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఖాతాలో బిల్లులు జమ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. హౌసింగ్ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించాలన్నారు. ఇంకా పూర్తి చేయని వారికి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తయిన వారికి బిల్లు చెల్లించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం తగదని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, వివిధ మండలాల తాసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.