దేవరకొండ రూరల్, జూన్ 30 : అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. సోమవారం దేవరకొండ మండలంలోని గన్యానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ విద్యా, వైద్యంపై చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. అలాగే రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచి పేద ప్రజల వైద్యానికి తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ సర్కార్ రైతన్నలకు వెన్నంటే ఉందని, రైతు భరోసా ద్వారా రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం జరిగిందన్నారు. రైతు మొఖంలో చిరునవ్వు చూడటమే తమ ప్రభుత్వ ద్వేయం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ, మార్పాకుల అరుణ సురేశ్, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.