ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరుతోవిపక్షాలకు అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారగా
బీఆర్ఎస్ మాత్రం దూకుడును మరింత పెంచింది. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలు సైతం కేసీఆర్ సర్కార్ విధానాలతో ఆకర్షితులు అవుతుండడంతో వారందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నది. మంగళవారం ప్రగతిభవన్ వేదికగా పలువురు కీలక నేతలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చేరికలతో పార్టీలో మరింత జోష్ నెలకొన్నది.
సర్కారు అభివృద్ధి, సంక్షేమంతోపాటు పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహం, విధానాల్లో స్పష్టత, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరు తమను బీఆర్ఎస్లో చేరేలా ప్రేరేపించిందని పార్టీలో చేరిన ముఖ్య నేతలు స్పష్టం చేశారు. బుధవారం దేవరకొండకు చెందిన ముఖ్య నేత బిల్యానాయక్ తన అనుచరులతో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ కూడా ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కేటీఆర్‌ను కలిశారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్10(నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమకు, సర్కార్ అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇప్పటికే గ్రామ స్థాయి, మండల స్థాయి నేతలు పెద్ద సంఖ్యలో నిత్యం పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్, బీజేపీ లాంటి విపక్ష పార్టీల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, అభ్యర్థ్ధుల ఎంపికలో ఆధిపత్య పోరు, టికెట్ అమ్ముకుంటున్నారని ముఖ్య నేతలపై ఆరోపణలు, తదితర అంశాలతో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో కీలక నేతలు సైతం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే ఒకవేళ వీళ్లు అధికారంలోకి వస్తే.. రాష్ర్టాన్ని కుక్కలు చించిన విస్తరిలా చేస్తారన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్షగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యూహరచన, చొరవతో ఆయా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రగతిభవన్ వేదికగా పలువురు కీలక నేతలు పార్టీలో చేరారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన పీసీసీ మాజీ కార్యదర్శి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నేత చామల ఉదయ్ చందర్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు.
కేటీఆర్ ఉదయ్చందర్రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన పలువురికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆలేరులో ఎమ్మెల్యే సునీతామహేందర్‌రెడ్డి హాట్రిక్ విజయం కోసం కృషి చేస్తామని ప్రకటించారు. ఇక హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వుకు చెం దిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్టీపీ ఇన్చార్జి జిల్లేపల్లి వెంకటేశ్వర్లు కూడా బీఆర్ఎస్లో చేరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సారధ్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో వెంకటేశ్వర్లు గులాబీ కండువా కప్పుకుని పార్టీ విజయం కోసం పనిచేస్తానని ప్రకటించారు.
నల్లగొండకు చెందిన చకిలం అనిల్‌కుమార్ తిరిగి మాతృసంస్థలోకి వచ్చారు. ఇటీవల పలు కారణాలతో పార్టీకి రాజీనామా చేసిన ఆయన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి సారథ్యంలో కేటీఆర్‌ను కలిశారు. పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేస్తానని స్పష్టం చేశారు. దేవరకొండకు చెందిన కాంగ్రెస్ నేత కేతావత్ బీల్యానాయక్ కూడా బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధ్దమయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నేతృత్వంలో బీల్యానాయక్ బుధవారం కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు.
ఇక మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మంగళవారం ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపుతో పాటు నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం పనిచేస్తానని కేటీఆర్‌కు వివరించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, పార్టీ నేతలు నంద్యాల దయాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.