సూర్యాపేట, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై భీకరంగా ప్రవహించిన వరదలతో అతలాకుతలమై సర్వం కోల్పోయిన బాధితులకు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సాయం అందలేదు. బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, తక్షణ సాయం కోసం కలెక్టర్ బ్యాంకు ఖాతాకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఇద్దరు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించారు తప్ప ఇతర బాధితులకు అందింది శూన్యం. తక్షణ సాయం అంటే గంటల్లో అందిస్తారు..
కానీ ఆరు రోజులైనా అందదా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లోని వందల ఇండ్లలోకి నీళ్లు చేరి నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. వేలాది ఎకరాల్లో పత్తి, వరి ఇతర పంటలు నేలపాలు కాగా వందలాది ఎకరాల పొలాల్లో ఇసుక, మట్టి మేటలు పేరుకుపోయాయి. ఇది జరిగి ఆరు రోజులు గడుస్తుండగా సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వరద బాధితులను ఎవరు పరామర్శించేందుకు వచ్చినా తమకు కనీసం తాగునీరు, భోజనాలు అందించాలని కోరుతున్నారు.
అయినా స్పందించిన నాథుడే కరువయ్యారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి వట్టి చేతులతో పర్యటించారు తప్ప ఎలాంటి సాయం చేయలేదు. గత నెల 31న కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలతోపాటు తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్దిరాల, అర్వపల్లి తదితర మండలాల్లో 25 నుంచి 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే.
భోజనాలు సమకూర్చిన బంధువులు, స్థానికులు
సూర్యాపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో వరదల కారణంగా దాదాపు 3వేలకు పైనే ఇండ్లలోకి మూడు ఫీట్ల నుంచి ఆరు ఫీట్ల వరకు నీరు చేరి వస్తువులన్నీ తడిసి మద్దయ్యాయి. దీంతో ఆయా ఇండ్లల్లో నివాసం ఉంటున్న వారి పరిస్థితి అంధకారంగా, అగమ్యగోచరంగా మారింది. ఇంటిని చూస్తుంటే దుఃఖం వస్తుందని, ఆకలైతే దిక్కులు చూసే పరిస్థితి దాపురించిందని పలువురు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా ఏదో ఒకటి అందుతుందని అనుకున్నామని, ఐదు రోజులు గడిచినా ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి పోతున్నారు తప్ప పట్టించుకోవడం లేదని అంటున్నారు. బంధువులు, స్థానికులే బాధితులకు ఆహారం అందిస్తున్నారు.
ఇంకా బాధితులను గుర్తిస్తున్న అధికారులు
వరద బాధితులకు వెంటనే రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. వరదల్లో చనిపోయిన రెండు కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు. కానీ పశువులు, మేకలు చనిపోయిన కుటుంబాలతో పాటు పూర్తిగా ఇండ్లు కూలిన వారికి, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు, వరదల్లో ఇండ్లలోకి నీరు చేరి సర్వం కోల్పోయిన వారికి సాయం అందలేదు. ఆరు రోజులవుతున్నా సాయం లేకపోగా ప్రస్తుతం బాధితులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఈ విషయమై కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణను వివరణ కోరగా బాధితులను గుర్తించేందుకు సర్వే పూర్తి కావచ్చిందని, నేడో రేపో బాధిత కుటుంభాలకు నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు.