– మండలాధికారులకు దోసపహాడ్ గ్రామస్తుల ఫిర్యాదు
పెన్పహాడ్, జనవరి 16 : తమ గ్రామానికి చెందిన మూసి వాగులోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపి కృష్ణకు దోసపహాడ్ సర్పంచ్ వలపట్ల సైదమ్మ అంజయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్, పలువురు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో అభివృద్ధి పనులకు, నూతన గృహ నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడుతుందన్నారు. మూసి వాగు నుండి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఒక్కటీ రెండు ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నా గ్రామంలో రాత్రి సమయంలో పదుల సంఖ్యలో విచ్చలవిడిగా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా వల్ల సామాన్యులకు, రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న వారికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి వెళ్తే ట్రాక్టర్లతో గుద్ది చంపుతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు యాలంల జగన్, వార్డు సభ్యులు కొండేటి అశోక్ రెడ్డి, నాగయ్య, గోవర్ధన్, భిక్షం, మాజీ సర్పంచులు మేకల శ్రీనివాస్, దొంగరి సుధాకర్, దుర్గయ్య, ఒగ్గు రాంబాబు పాల్గొన్నారు.