– 5న చేపట్టే చలో అసెంబ్లీని విజయవంతం చేయండి
– విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు
కోదాడ, జనవరి 02 : మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వం మనోవేదనకు గురిచేస్తుందని, బకాయిలు తక్షణమే చెల్లించకుంటే ఉద్యమం తప్పదని విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు అన్నారు. శుక్రవారం కోదాడ విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆయన మాట్లాడుతూ.. పిల్లల పెళ్లిళ్లు చేసి, ఇల్లు కట్టుకుని, వ్యక్తిగత రుణాలు, విద్య రుణాలు తీసుకుని ఇన్స్టాల్మెంట్ చెల్లించలేని పరిస్థితిలో రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు రిటైర్ అయ్యి వివిధ రకాల సమస్యలతో, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న నిర్వహిస్తున్న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమస్యల పరిష్కారానికి నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడికి తమ సంఘం పక్షాన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
బకాయిల సాధన సమితి అధ్యక్షుడు పొనుగోటి కోటయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీ ముట్టడికి విశ్రాంతి ఉద్యోగులు భారీగా తరలిరావాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని, వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల రూ.700 కోట్లు ఇస్తున్నప్పటికీ అవి ఎక్కువ మొత్తంలో సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులకు మాత్రమే చెల్లించబడుతున్నాయన్నారు. నెలకు రూ.1,500 కోట్లు ఇస్తూ అందులో పెద్ద మొత్తాన్ని 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన సమితి కోదాడ డివిజన్ అధ్యక్షుడు షేక్ బాలేమియా, సీనియర్ పెన్షనర్స్ అమృతా రెడ్డి, జగన్, వరప్రసాదరావు, భ్రమరాంబ, పుల్లయ్య, లక్ష్మీ నరసయ్య, కోటయ్య, పొట్ట నాగేశ్వరావు, రమేశ్ బాబు, మణిరామ్, షేక్ హుస్సేన్, అప్పిరెడ్డి, జాఫర్, రంగారావు పాల్గొన్నారు.