ఆలేరు టౌన్, జూలై 30 : బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును పార్లమెంట్లో పెట్టి తీర్మానం చేయాలని, బీసీ బిల్లు అమలు కాకపోతే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆలేరు పట్టణ కేంద్రంలోని రహదారి బంగ్లాలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయాలు తప్ప రాష్ట్ర అభివృద్ధిపై, సంక్షేమంపై దృష్టి లేదని విమర్మించారు. రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు సలహాలు, సూచనలను ఇస్తుంటే వాటిని విమర్శలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అబద్ధ్దాలు చెప్పడం, మోసం చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో సవరణ చేయాల్సిన అవసరం ఉన్నదని, దానిపై రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు వెళ్లి ఒప్పించాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిపై ఉందన్నారు. ‘ఆగస్టు 11న మంత్రులతో కలిసి కేంద్రం వద్దకు వెళ్లి మాట్లాడతామని చెప్పడం కాదు.. 18 నెలల కాలంలో ఏం చేశారో చెప్పాలి’ అని అన్నారు.
బీసీ సంఘాలు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడితో ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ 36 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని శాసనసభలో బిల్లు పెడితే, కొందురు కోర్టుకు వెళ్లడంతో ఆ రోజు బిల్లు అగిందన్నారు. అదే 26 శాతం బిల్లు కొనసాగిందన్నారు. ‘ఎవరైనా మాట్లాడితే ఓసీలకెందుకు అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఓసీలైనా, ఎస్సీలైనా, బీసీలైనా రాజ్యాంగ కల్పించిన హక్కులకు కట్టుబడి ఉంటారు’ అని స్పష్టం చేశారు. 42 శాతం బీసీ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్‌లకు చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి 42 శాతం బీసీ బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మిమ్మల్ని స్వాగతిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోగా బీసీ బిల్లు తీసుకురాకపోతే ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపాల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశంగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుండె సంపత్, మండల ప్రధాన కార్యదర్శి రచ్చ రామనర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొరుకొప్పుల కిష్టయ్య, బీఆర్ఎస్ నాయకులు ఎండీ ఫయాజ్, కాంతి మహేందర్, బింగి రవి, ఐలి కృష్ణ, మొరిగాడి అశోక్, కటకం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.