ఆదిలాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): క్యాతనపల్లిలో ప్రజాతీర్పును కాలరాసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు బనాయించి జైలులో ఎన్నో ఇబ్బందులు పెట్టిందని.. అయి నా చివరకు న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. తనను జైలుకు పంపినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్‌కు ఇప్పుడు కడుపుమంట చల్లారిందని అనుకుంటున్నానని, ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి క్యాతనపల్లి చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 17న కౌన్సిల్ హాల్లో కాంగ్రెస్ నేతల దుర్మార్గానికి సంబంధించిన వీడియో ఫుటేజీని ఎన్నికల కమిషన్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అదే విధంగా త్వరలో ఒక తేదీని ప్రకటించి ఎ న్నికలు నిర్వహించాలని, ప్రజాతీర్పు ప్రకారం తమకు చైర్మన్, వైస్ చైర్మన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బెయిల్ మంజూరు కావడంతో బుధవారం ఉద యం ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న, వందలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు సుమన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం జైలు ఎదుట జోగు రామన్నతో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. క్యాతనపల్లిలో 22 స్థానాలకు 14 సీట్లు తమకు వస్తే.. ఏడు సీట్లు వచ్చిన కాంగ్రెస్ సభ్యు లు చైర్మన్ ఎలా అవుతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వివేక్‌లు ప్రజాతీర్పును గౌరవించకుండా కౌన్సిల్లో దుశ్శాసనపర్వానికి తెగబడి, బయట రాళ్లదాడులు చేసి అక్రమ కేసులు పెట్టడం శోచనీయమంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేసిన వక్రమార్గంలో పదవులను దక్కించుకునే ప్రయత్నాలు చేసినా క్యాతనపల్లిలో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తంచేశారు.
అధికారం మత్తులో కాంగ్రెస్ దౌర్జన్యం
మంత్రి వివేక్ నేతృత్వంలో మున్సిపాలిటీని దక్కించుకోవడానికి దౌర్జన్యానికి తెగబడ్డారని బాల్క సుమన్ మండిపడ్డారు. తమపై రాళ్లు విసిరిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25మందిపై అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార పార్టీ నాయకులను వదిలిపెట్టి పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారంటూ నిప్పులుచెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇదే తీరు కొనసాగుతున్నదని, కోల్‌బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తున్నదని, మంచిర్యాల కలెక్టర్, డీసీపీ మొదలు అధికారులు, పోలీసులంతా అధికార పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు హుందాగా స్వీకరించే ధైర్యం, సంస్కా రం నాయకులకు ఉండాలని సూచించారు. చె న్నూర్లో 18 స్థానాలకు 11 వా ర్డుల్లో కాంగ్రె స్ విజయం సాధిస్తే ప్రజాతీర్పు ను గౌరవిస్తున్నట్టు ప్రకటించానని, మరి క్యాతనపల్లిలో మంత్రి వివేక్ ప్రజాతీర్పును ఎందు కు గౌరవించడం లేదని సుమన్ ప్రశ్నించారు.
జైలులో ఎన్నో ఇబ్బందులు పెట్టారు
సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో మంత్రి వివేక్ పోలీసులతో కలిసి తమను జైలులో ఎన్నో ఇబ్బందులు పెట్టారంటూ బాల్క సుమన్ ఆవేదన వ్యక్తంచేశారు. దోమలున్న గదిలో ఉంచి, భోజనం కూడా సరిగా పెట్టలేదని చెప్పారు. మంచినీళ్లు సరిగా లేక గొంతునొప్పితో బాధపడ్డానని తెలిపారు. జైలులో ట్యాబ్లెట్లు ఇచ్చే దిక్కులేదని, విపరీతమైన చలి ఉన్నా దుప్పట్లు ఇవ్వకపోతే తమ అడ్వొకేట్ శ్రీకాంత్ పంపారని చెప్పారు. జైలులో ఆంక్షలు విధించి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్నీ భరించానని పేర్కొన్నారు. తనకు ఇప్పటికే బెయిల్ రావాల్సి ఉన్నా, ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి వాయిదా వేయించారని సుమన్ ఆరోపించారు. హోలీ పండుగతో పాటు తన చిన్న కుమారుడి పుట్టిన రోజున కుటుంబసభ్యులతో తాను ఉండొద్దనే వారి పైశాచిక ఆనందం వల్లే రెండు రోజులు జైలులోనే ఉండేలా కుట్ర చేశారంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా బెయిల్ వచ్చేందుకు కృషిచేసిన తన అడ్వొకేట్లకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. బెయిల్ విషయంలో తమ నాయకుడు కేసీఆర్ ఎప్పటికప్పుడు వాకబు చేశారంటూ కృతజ్ఞతలు తెలిపారు. జైలులో తనను పరామర్శించి పెద్దలు కేటీఆర్, హరీశ్ ధైర్యం చెప్పారని తెలిపారు. మాజీ మంత్రులు జోగు రామన్న, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, సంజయ్, వివేక్‌గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, నాయకులు కోనప్ప, గొంగిడి సునీత, దివాకర్‌రావు, చిన్నయ్య, జాజుల సురేందర్, విద్యార్థి సంఘాల, యువజన సంఘాల నాయకులు, చాలామంది తనను కలిసి మనోధైర్యం కల్పించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మేం కక్షా రాజకీయాలు చేయలే..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ కక్షారాజకీయాలు చేయలేదని బాల్క సుమన్ తెలిపారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వివేక్‌ను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ సలహాదారుడిగా నియమించిందని గుర్తుచేశారు. అదే విధంగా 2018లో చెన్నూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి వెంకటేశ్ నేత ఓడిపోతే ఆయనకు బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీ అవకాశమిచ్చినట్టు చెప్పారు. తాము కలుపుకొనిపోయే పనులు చేశాం తప్ప కక్షలు పెట్టుకోలేదని స్పష్టంచేశారు. తాము ఇతర పార్టీల వారిని రాజకీయ ప్రత్యర్థులుగా చూశామే తప్ప, వ్యక్తిగతంగా శత్రుత్వం పెట్టుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అందరినీ శత్రువులుగా చూస్తున్నదని, ప్రధాన ప్రతిపక్షాల నాయకులు ఏది మాట్లాడినా శత్రువుల లాగా చూసి కేసులు పెట్టి జైల్లో పెట్టించి, దాడులు చేయిస్తున్నదని దుయ్యబట్టారు.
న్యాయం, ధర్మం గెలిచింది..
‘వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లకు కృతజ్ఞతలు. మొన్న రాత్రి 9 గంటలకు పోలీసులు జైలుకు వచ్చి కస్టడీ పిటిషన్ ఇవ్వాలని చూశారు. కానీ నేను అడ్వొకేట్ల సమ్మతి లేకుండా తీసుకోనని రాసి ఇచ్చాను. పోలీసుల దుర్మార్గాలను ఎక్కడికక్కడ పటాపంచలు చేసి న్యాయం, ధర్మం గెలిచేలా చేశారు. బెయిల్ వచ్చేలా చేసిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని సుమన్ తెలిపారు.
‘ఐ లవ్ యూ వివేక్’
‘17న ఎన్నిక సందర్భంగా నన్ను అరెస్టు చేసే సందర్భంలో నిరసన తెలిపిన మా కార్యకర్తలపై మా ఇంటి దగ్గర, మంచిర్యాలలో, ఆదిలాబాద్ జైలు వద్ద మూడు చోట్ల లాఠీచార్జ్ చేశారు. నన్ను, మా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నందుకు ‘ఐ లవ్ యూ వివేక్’. చాలా సంతోషం.. నో ప్రాబ్లమ్. ఏదీ ఊరికే పోదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. ఇవాళ మీరేంటో, మేమేంటో వచ్చే ఎన్నికల్లో తేలుస్తారు’ అని సుమన్ పేర్కొన్నారు.
క్యాతనపల్లిలో గులాబీ గెలుపు ఖాయం
క్యాతనపల్లి మున్సిపాలిటీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చైర్మన్‌గా బీఆర్ఎస్, వైస్ చైర్మన్‌గా సీపీఐ గెలువడం ఖాయమని, ఇక్కడ ఎగిరేది గులాబీ జెండాయేనని బాల్క సుమన్ ధీమాగా చెప్పారు. జైలు నుంచి విడుదలై క్యాతనపల్లిలోని తన నివాసానికి వచ్చిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చెన్నూర్ చోటా నియంతగా మారిన మంత్రి వివేక్ చేసిన అరాచకాలు యావత్ తెలంగాణ సమాజం చూసిందని పేర్కొన్నారు.
ప్రజాతీర్పును గౌరవించకుండా ఇలాగే అరాచకాలు చేస్తామంటే మరో ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, రాష్ట్ర నాయకులు విజిత్‌రావు, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జైలు నుంచి క్యాతన్‌పల్లిలోని తన నివాసానికి వచ్చిన సుమన్‌ను ఆయన సతీమణి రాణీ అలేఖ్య, చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు స్వాగతం పలికారు.