హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ) : ప్రత్యక్ష రాజకీయాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి గుడ్‌బై చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్లీ తనకు అవకాశం ఇస్తే మాత్రం కౌన్సిల్లో ఉంటానని తెలిపారు. శాసనమండలిలోని తన చాంబర్లో బుధవారం మీడియాతో గుత్తా చిట్‌చాట్ నిర్వహించారు. తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డికి ఎకడ అవకాశం వస్తే అకడినుంచి పోటీలో ఉంటారని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, రాజకీయంగా చాలా మార్పులు వస్తాయని, రిజర్వేషన్లు మారుతాయని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ప్రాంగణంలో రూ.30కోట్లతో శాసనమండలి భవన పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయని, ఒక శాతం మాత్రమే మిగిలి ఉన్నదని గుత్తా చెప్పారు. ఈ నెల 8న కౌన్సిల్ హాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
అసెంబ్లీలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహం 8వ తేదీలోగా పూర్తయితే అదే రోజు విగ్రహావిషరణ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ తరహాలో ప్రజాప్రతినిధులెవరికీ ఇబ్బందుల్లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ శాసనపరిషత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆదర్శనగర్‌లోని తొమ్మిది ఎకరాల్లో కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మించబోతున్నట్టు చెప్పారు. డ్రైనేజీ, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, సీఎం చాంబర్, చైర్మన్, వైస్ చైర్మన్ చాంబర్, సెక్రటరీ ఆఫీస్, కౌన్సిల్ సెక్రటరీయేట్, మీడియా హాల్ తయారు చేశామని వివరించారు. హెరిటేజ్ భవనం అయినందున చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి వచ్చిందని అందుకే ఏడాదిన్నర సమయం పట్టిందని తెలిపారు. ఇక 40-50 ఏండ్ల వరకు భవనానికి ఢోకా ఉండదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న శాసనమండలిని, జూబ్లీహాల్‌ను పునరుద్ధరించి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించే ఆలోచనలో సరార్ ఉన్నట్టు చెప్పారు.