హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 15వ తేదీలోపు అన్ని అధికారిక ఫైళ్లు ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈ-ఆఫీస్) ద్వారా మాత్రమే నిర్వహించాలని ఆర్థికశాఖ అన్ని శాఖలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళవారం అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 15 తేదీ నుంచి ఆర్థికశాఖ ఆధీనంలోని అందరూ శాఖాధిపతులు అన్ని అధికారిక ఫైళ్లను తప్పనిసరిగా ఈ-ఆఫీస్‌లో మాత్రమే ప్రాసెస్ చేయాలని స్పష్టంచేశారు.
15వ తేదీ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫిజికల్ ఫైల్ ప్రారంభించవద్దని, స్వీకరించవద్దని, పంపవద్దని, కఠినంగా వ్యవహరించాలని స్పష్టంచేసింది. నోటింగ్, డ్రాఫ్టింగ్, ఆమోదాలు, రికార్డు నిర్వహణ ఇలా.. అన్ని ఆన్లైన్లోనే జరగాలని కోరింది. పెండింగ్‌లో ఉన్న ఫిజికల్ ఫైళ్లను 15వ తేదీలోగా ముగించాలని, ఈ మేరకు సబ్ ఆర్డినేట్ కార్యాలయాలకు అవసరమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. సాంకేతిక సమస్యలు ఉంటే ఐటీ సెల్‌ను సంప్రదించాలని ఆర్థికశాఖ స్పెషల్ సెక్రటరీ రాయీ రవి తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు.