హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ యాక్ట్ కింద అప్పిలేట్ అథారిటీగా జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను సమీక్షించే అధికారం అదే చట్టం కింద నియమితులైన కమిషనర్‌కు ఉండదని హైకోర్టు స్పష్టంచేసింది. కలెక్టర్ ఉత్వర్వులపై అప్పీల్‌ను పరిశీలించి వాస్తవాల ఆధారంగా తిరిగి పరిశీలించాలంటూ కమిషనర్ జారీచేసిన ఆదేశాలను రద్దుచేసింది.
హైదరాబాద్ కొత్తపేటలోని ఇంటిపై తాత ఇచ్చిన గిఫ్ట్‌డీడ్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులను సీ శ్రీనివాస్ సవాలు చేసిన పిటిషన్‌ను గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ శ్రీనివాస్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం విచారణ పూర్తి చేసి పైవిధంగా తీర్పు వెలువరించింది.
వాదనల తర్వాత ద్విసభ్య ధర్మాసనం.. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ప్రాథమిక దర్యాప్తు అధికారి ఆర్డీవో అని, దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్ కలెక్టర్ మాత్రమేనని, ఆ తర్వాత కమిషనర్ జోక్యం చేసుకునేందుకు వీల్లేదని గుర్తుచేసింది. కలెక్టర్ రెండో అప్పీల్‌ను విచారణ చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. ఆధారాలు లేకుండా శ్రీనివాస్ తప్పుడు పత్రాలను సృష్టించారని పేరొనడాన్ని తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై సివిల్ కోర్టులో తేల్చకోవాలని సూచన చేసింది.