యాదగిరిగుట్ట, ఫిబ్రవరి27: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేసవి ప్రారంభంలోనే నాణ్యత లేని విద్యుత్తు సరఫరాతో రోజుకు వందల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్న ఘటనలు ఆలేరు నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.
ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేశామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లకాలంలో విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లు కాలిన ఘటనలు లేవన్నారు. రైతు పక్షపాతి అయిన కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్తుతోపాటు రైతు బంధు, రైతు బీమా అమలు చేసి రాష్ట్రంలోని రైతులు దేశానికే అన్నంపెట్టే స్థాయికి తీసుకువచ్చారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను వరిపంట దిగుమతిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగలా మార్చారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయానికి చీకటి రోజులు దాపురించాయన్నారు. వ్యవసాయానికి సరిపడా విద్యుత్తు సరఫరాలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే రైతులకు విద్యుత్తును సరఫరా చేస్తున్నారన్నారు. సరఫరా చేస్తున్న విద్యుత్తు కూడా నాణ్యంగా లేకపోవడంతో టాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయన్నారు. విద్యుత్ ట్రాన్స్పార్మర్ల పునరుద్ధరించేందుకు రైతులు విద్యుత్ సబ్ డివిజన్లోని ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ బాటపడుతున్నారన్నారు.
సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులపై కాంగ్రెస్ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. వారిని పట్టించుకునే నాధుడేలేడన్నారు. యూరియా కావాలంటే రైతులు చెప్పులు క్యూలో పెట్టి వేచి చూడాల్సి వస్తోందన్నారు. స్మార్ట్ ఫొన్లు లేని రైతులు యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు భరోసా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉందన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు మాని రైతులకు సకాలంలో నాణ్యమైన విద్యుత్తు, యూరియా, రైతు భరోసా అందజేయాలన్నారు. దీనిపై త్వరలో బీఆర్ఎస్ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.