యాదాద్రి, ఆగస్టు 28 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో పులకించింది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎటు చూసిన భక్తులే దర్శనమిచ్చారు. క్యూలైన్ల గుండా తూర్పు ద్వారం, త్రితల రాజగోపురం నుంచి నేరుగా ప్రధానాలయంలోకి వెళ్లి భక్తులు స్వయంభువులను దర్శించుకున్నారు. స్వామి ధర్మ దర్శనానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నా రు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం జరిపారు. లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు సుదర్శన నారసింహహోమం ఘనంగా నిర్వహించారు.
సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం చేశారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో అధిక సంఖ్య లో భక్తులు పాల్గొని తరించారు. సాయంత్రం వెండి మొక్కు జోడు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలు ఘనంగా నిర్వహించారు. స్వామిని సుమారు 40వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.42,85,155 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.