నల్లగొండ ప్రతినిధి, నవంబర్25(నమస్తే తెలంగాణ) : ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు.. నవంబర్ 29వ తేదీన ఉమ్మడి జిల్లాలో భారీ ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సన్నద్ధం అవుతున్నది. ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ మళ్లీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేలా దీక్షా దివస్ నిర్వహణకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా జిల్లాల వారీగా దీక్షా దివస్‌ను పెద్దఎత్తున నిర్వహించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా నేతలంతా దీక్షా దివస్ సక్కెస్ కోసం రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్చార్జిలను సైతం కేటీఆర్ ప్రకటించారు. అందులోభాగంగా నేడు జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాల్లో సన్నాహక సమావేశాలకు సిద్ధమయ్యారు. దీనికి పార్టీలోని అన్నిస్థాయిల్లోని నేతలను, ముఖ్యులను ఆహ్వానించారు.
రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నేతల వరకు ఆహ్వానం
దీక్షా దివస్ కార్యక్రమం విజయవంతం కోసం మంగళవారం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. సన్నాహక సమావేశాల కోసం ఇప్పటికే పార్టీ జిల్లా కార్యాలయాలను సిద్ధం చేశారు. ఆదివారం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి దీక్షా దివస్ ప్రాధాన్యతను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఇక సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ మహాధర్నాకు తరలివెళ్తుంటే ఉమ్మడి జిల్లా పార్టీ నేతలు, ముఖ్యులంతా అడుగడుగునా స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక మంగళవారం దీక్షా దివస్ కార్యక్రమ విజయవంతం కోసం సన్నద్ధం అవుతున్నారు. అందులోభాగంగా పార్టీ జిల్లా కార్యాలయాల్లో వందలాది మందితో సమావేశాలకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల నేతలతోపాటు అన్ని స్థాయిల్లోని ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులను, గ్రామశాఖ, అనుబంధ సంఘాల నేతల వరకు ఆహ్వానించారు. వీరంతా నేడు సమావేశాలకు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. యదాద్రిభువనగిరి జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు భువనగిరిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. దీనికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1గంటకు నల్లగొండ జిల్లా సన్నాహక సమావేశం నల్లగొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు.
జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అధ్యక్షతన జరుగనున్న సమావేశానికి జగదీశ్‌రెడ్డితో పాటు ఇన్చార్జి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఇక సూర్యాపేటలో మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో పాటు దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలంతా దీక్షా దివస్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నేతలు, కార్యకర్తలంతా సన్నాహక సమావేశాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మండలాల వారీగా పార్టీ బాధ్యులకు పని విభజన చేస్తూ భారీ ఎత్తున తరలివచ్చేలా రంగం సిద్ధం చేశారు.