సూర్యాపేట, సెప్టెంబర్ 10 : అభివృద్ధిని పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. డైవర్సన్ పాలిటిక్స్ తో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. రెండేళ్లుగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. కరెంట్, కాళేశ్వరం మీద కమిషన్లు, ట్యాపింగ్ కేసు ప్రతిదీ అబద్ధం అని తేలిపోయిందన్నారు. ఆ ఫార్ములా, ఈ ఫార్ములా అని మళ్లీ కాలయాపన మొదలు పెట్టినరని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా కొనసాగించాలన్నారు.
ప్రభుత్వ ఆదాయ, వ్యయాల బాధ్యత నిరంతర ప్రక్రియ. ఈ ఫార్ములా విషయంలో వారి జ్ఞానం ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. ఈ కేసులో వాళ్లతో మిలాకత్ అయి డ్రామాలు చేస్తున్నరని మడ్డిపడ్డారు. గ్రూప్-1 విషయంలో కాంగ్రెస్ నాయకుల డ్రామాలు బయటపడ్డట్లు చెప్పారు. కేటీఆర్ ఆనాడే చెప్పాడు, ఇది లొట్టపిస్ కేసు అని. అసలు కేసులు పెట్టాల్సి వస్తే ఈ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులను వందసార్లు జైళ్లో పెట్టొచ్చు. ప్రజలను చేసిన మోసానికి.. వాళ్లు ఎంత ఆవేశంగా ఉన్నారో చూస్తలేవా రేవంత్.. మీడియాలో స్పేస్ ఆక్యూపై తప్పా.. ప్రజల మనసుల్లో స్పేస్ ఆక్యూపై చేయలేవన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతున్నారో.. యువత ఎంత కోపంగా ఉన్నారో చూస్తున్నాం. హాస్టళ్లల్లో విషాహారం చేత చంపబడ్డ విద్యార్థుల ఆత్మలు కూడా రేవంత్ చుట్టే తిరుగుతాయన్నారు.
ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా పని చేయాలన్నారు. కేసీఆర్‌ను తిట్టడం, కేసులు పెడతాననడం వంటి చిల్లర మాటలు బంద్ చేయి. నీ డైవర్షన్ ఫార్ములానే పనికిమాలిందని అందరికీ అర్థమైంది. రైతులు ఒకపక్క యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ల శాపనార్థాలు ఉరికనే పోవు. వాళ్ల దృష్టిలో ఎప్పటికి ద్రోహిగానే మిగిలిపోతావు. కేసును సీబీఐకి అప్పగించడంతోనే ప్రధాని మోదీతో నీ బంధం బహిర్గతమైంది. చోటబాయ్.. బడే బాయ్ బంధం బయటపడింది. ప్రజల దృష్టిలోనే కాదు వారి అధిష్టానం దృష్టిలో కూడా రేవంత్ కౌంట్ అవుతున్నాడు. ఈ డ్రామాలు, డైవర్సన్ పాలిటిక్స్ తో బీఆర్ఎస్ను ఏమి చేయలేవు. తెలంగాణ ప్రజలను ఏమార్చడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.