సూర్యాపేట, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మ బలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అవినీతి మయంగా మార్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇం డ్ల ఎంపిక ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ డబ్బులు ఇచ్చిన వారినే అర్హులుగా గుర్తించడంతో అసలైన నిరుపేదలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ప్రభుత్వ అలసత్వంతో ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. నియోజకవర్గానికి 3500ల ఇండ్లను మంజూరు చేసి మండలానికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. జనవరి 26న ప్రారంభించిన ఈ పథకం ఐదు నెలలు గడిచినా పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో కనీసం ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేకపోయారు. ఇక ఇతర గ్రామాల్లో ఇండ్ల పరిస్థితి అతీగతీ లేదు. మాది ఇందిరమ్మ రాజ్యం.. అంటూ గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నింటా విఫలమవుతూ, ఇచ్చిన హామీల్లో ఐదు శాతం కూడా పూర్తి చేయలేదు. పేదలకు ఇచ్చే ఇండ్లకు దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ పేరు పెట్టి పథకాన్ని అవినీతి మయంగా మార్చింది. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలు, ఇంటి స్థలం ఉన్న వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇండ్లు నిర్మించుకుంటే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించింది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లను మంజూరు చేసి ప్రతి నియోజకవర్గానికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి అర్హులకు ఇండ్లు ఇస్తామంది. జనవరి 26న ఈ స్కీంను జిల్లాలో ప్రారంభించి దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నత్త నడకన కొనసాగుతున్నాయి. నియోజకవర్గానికి 3500ల చొప్పున జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 14వేల ఇండ్లు మంజూ రు చేశారు. ఒక్కో ఇంటికి రూ.5లక్షల చొ ప్పున 700ల కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్టు గ్రామాలు మినహా ఇతర గ్రామాల్లో ఎంపిక ప్రక్రియనే పూర్తి కాలేదు. మరో పక్క సూర్యాపేట జిల్లా లో 23 పైలట్ గ్రామాలకు గాను 4,322 ఇండ్లు నిర్మించాల్సి ఉండగా వీటికి దాదాపు 216 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఐదు నెలలైనా కేవలం 13కోట్లు మాత్రమే వెచ్చించారు. జిల్లాలోని పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో 3270 ఇండ్లకు జిల్లా కలెక్టర్ అప్రూవల్ ఇవ్వగా వాటిలో 1219 ఇండ్లకు మార్కింగ్ పూర్తయింది. బేస్మెంట్ లెవల్ వరకు 830 ఇండ్లు పూర్తి కాగా, గోడలు నిర్మాణం పూర్తయినవి 311 ఇండ్లు, ఆర్సీ పూర్తయినవి 122 ఇండ్లు ఉన్నాయి.
గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు కేటాయించాల్సిన ఇండ్లను అనర్హులకు కేటాయిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో తరచూ ఇందిరమ్మ ఇండ్ల కోసం పేదలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎంపిక చేసిన అర్హుల జాబితాకు అనుగుణంగానే అధికారులు ఇండ్లు కేటాయిస్తున్నారే తప్ప కనీస పర్యవేక్షణ ఉండడం లేదు. ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్న వారంతా అధికార పార్టీకి చెందిన వారే కావడంతో సొంత పార్టీ వారితో పాటు తమ బంధువులనే ఎంపిక చేస్తున్నారని, అలాగే అడిగినంత డబ్బులు ఇచ్చిన వారికే ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో జరుగుతున్న అవకతవకలపై అధికారులు మాట్లాడుతూ తాము ఉత్సవ విగ్రహాలమేనని బదులిస్తున్నారు. అధికార పార్టీ నాయకులను కాదని మార్పులు, చేర్పులు చేస్తే ఉద్యోగాలు చేయలేమంటున్నారు. గ్రామాల్లో ఇం దిరమ్మ కమిటీ సభ్యులు తీర్మానం చేసి త మకు పంపిన లబ్ధిదారుల జాబితా ప్రకారమే ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు చెబుతున్నారు.
తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కొందరు కాంగ్రెస్ నాయకులు మోసం చేశారని, తన వద్ద రూ.20 వేలు తీసుకున్నారని, అర్హుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్థాపానికి గురై తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన కనకయ్య అనే నిరుపేద గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే.
ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఎనుబాముల గ్రామానికి చెందిన కలకోట పాండు అనే నిరుపేద దళితుడు తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ పంచాయతీ కార్యాలయం ఎదుటే గుడిసె వేసుకొని భార్యాపిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు.
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపాసాగర్ పరిధిలోని కోమటిగూడెం గ్రామానికి చెందిన మాతంగి సైదమ్మ అనే ఒంటరి మహిళ తనకు అర్హత ఉన్నా ఇల్లు మంజూరు చేయకపోవడంతో పంచాయతీ కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేసింది.