సూర్యాపేట టౌన్, డిసెంబర్ 06 : శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ సేవలు వెలకట్టలేనివని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సమానంగా చాలా సందర్భాల్లో హోంగార్డు ఆఫీసర్స్ విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. సాంకేతిక పరంగా, సిసిటిఎన్ఎస్ గా, రైటర్స్ గా విధులు నిర్వర్తించడంలో హోంగార్డ్ ఆఫీసర్స్ ముందున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలోను, వరదల సమయంలోనూ కష్టపడి పని చేస్తున్నట్లు తెలిపారు. హోంగార్డ్ ఆఫీసర్ సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ అనుక్షణం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా వారి పిల్లల చదువుల కోసం, ఆరోగ్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి హోంగార్డ్ సంక్షేమ నిధి నుండి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.
ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ పిల్లలకు మొదటి బహుమతిగా రూ.18 వేలు, రెండో బహుమతిగా రూ.15 వేలు, మూడవ బహుమతిగా రూ.12 వేలు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. అదే విధంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపుతున్న వారికి మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.8 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన హోంగార్డ్ ఆఫీసర్స్ కు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. హోంగార్డ్ ఆఫీసర్స్ తో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయం లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ముడ్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, హోంగార్డు ఇన్చార్జి ఆర్ఎస్ఐ అశోక్, ఇతర ఆర్ఎస్ఐలు సురేశ్, సాయిరాం, రాజశేఖర్, ఏఆర్ ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు.

Suryapet Town : హోంగార్డ్స్ సేవలు వెలకట్టలేనివి : ఎస్పీ నరసింహ