రామగిరి, జూన్ 8: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘టీజీఐసెట్’-2025 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో నిర్వహిస్తుండగా తొలి రోజు సజావుగా ముగిసింది. ఉదయం జరగాల్సిన ప్రశ్నపత్రం కీని ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణారెడ్డి, మధ్యాహ్నం జరగాల్సిన పరీక్షల కీని ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొ.ఇటికాల పురుషోత్తంరెడ్డి, సెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సే న్, కన్వీనర్, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల రవిలతో కలిసి ఉదయం, మధ్యాహ్నం వేర్వేరుగా పరీక్ష సమయం కంటే ముందుగా విడుదల చేశారు. తొలిరోజు 48,660 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 44,033 మంది హాజరు కాగా 4,627మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. షిఫ్ట్ -1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 93 పరీక్ష కేంద్రాల్లో 24,330మంది అభ్యర్థులకు 21,897మంది విద్యార్థులు హాజరుకాగా 90 శాతం హాజరు నమోదైంది.
షిఫ్ట్ -2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు 91 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 24,330 మందికి 22,136మంది హాజరయ్యారు. 90.98శాతం హాజరునమోదైనట్లు టీజీ ఐసెట్ కన్వీనర్ ప్రొ. అల్వాల రవి వెల్లడించారు. సోమవారం ఉదయం షిఫ్ట్ -3తో పరీక్ష ముగుస్తుంది. ఎంజీయూలో ఏర్పాటు చేసిన కమాండింగ్ సెంటర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 93 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షల నిర్వహణ తీరు ను సెట్ కన్వీనర్ ప్రొ. అల్వాల రవి సమీక్ష నిర్వహించి ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పరిశీలకులను సయాయత్తం చేశారు. ఈ పరీక్షల నిర్వహణలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ. శ్రీరామ్ వెంకటేశ్, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాన్ని ఎంజీయూ వీసీ, సెట్ చైర్మన్ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్, హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.