యాదగిరిగుట్ట, జూలై 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులు స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకుని ఆలయ ఖజానాకు రూ.30,59,522 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా, ఆలయ పర్యవేక్షకులు రామ్మోహన్రావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.